ప్రభుత్వ ఔట్‌లెట్లలో లక్ష లీటర్ల నూనె విక్రయం

మార్కెట్‌లో విజయ బ్రాండ్‌ ఆయిల్స్‌కు మంచి ఆదరణ

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ ఔట్‌లెట్లలో లక్ష లీటర్ల నూనె విక్రయం
-మార్కెట్‌లో విజయ బ్రాండ్‌ ఆయిల్స్‌కు మంచి ఆదరణ
-విస్తృత తనిఖీలతో కృత్రిమ కొరతకు చెక్‌
టీ మీడియా, మే 9, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వంట నూనెల ధరలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రైతుబజార్లు, మున్సిపల్‌ మార్కెట్లలో విజయ బ్రాండ్‌ ఔట్‌లెట్ల పేరుతో చేపట్టిన విక్రయాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఔట్‌లెట్లలో 1,01,165 లీటర్ల వంట నూనెను విక్రయించడం విశేషం. ఇందులో రైతుబజార్లలో 70,580 లీటర్లు, మున్సిపల్‌ మార్కెట్లలో 30,585 లీటర్ల అమ్మకాలు జరిగాయి. మరోవైపు డిమాండ్‌కు అనుగుణంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, 2వేల జనాభాపైడిన పంచాయతీల్లోనూ స్వయం సహాయక సంఘాల ద్వారా విజయ నూనె విక్రయానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : ‘పవన్’ ఏ పార్టీతో పొత్తులో ఉన్నాడో ప్రజలకైనా చెప్పాలి

విస్తృతంగా తనిఖీ..
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో పాటు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి డిమాండ్‌ను సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఇప్పటి వరకు తనిఖీల్లో నిత్యావసరాల చట్టం ప్రకారం (6ఏ) 76 కేసులు నమోదు చేసి 22.59 లక్షల లీటర్ల నూనెను సీజ్‌ చేసింది. వీటిల్లో కేసులు పరిష్కరించిన వాటిని మార్కెట్‌లోకి విడుదల చేయడంతో పాటు మిగిలిన వాటిని ప్రభుత్వ నూనె కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా సన్‌ఫ్లవర్‌ స్థానంలో సోయాబీన్, రైస్‌బ్రాన్‌ నూనె అమ్మకాలను చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ప్రైవేటు ఔట్‌లెట్లలో ప్రభుత్వ ధరలకే..
అంతర్జాతీయంగా నూనెల ధరల సెగ నుంచి సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. ఆయిల్‌ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో సమావేశాలు నిర్వహించి తక్కువ ధరలకు నూనెలు విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే వంట నూనెల ధరలు చాలా వరకు అదుపులోకి రావడంతో పాటు ఎక్కడా కూడా కృత్రిమ కొరత తలెత్తలేదు. హోల్‌సేల్‌ విక్రేతల సాయంతో 256 రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా సుమారు 11.20లక్షల లీటర్ల వంట నూనెను ఎమ్మార్పీ కంటే తక్కువ రేట్లకే అందించడం గమనార్హం.

Also Read : పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు.. బ‌య‌ట‌కు వ‌స్తున్న పాములు

విజయ ఆయిల్స్‌కు మంచి ఆదరణ
వంట నూనెల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం విజయ ఆయిల్‌ పేరుతో విక్రయాలు చేపట్టింది. మార్కెట్‌ ధరలతో పోలిస్తే విజయ ఆయిల్స్‌ ధరలు తక్కువగా ఉండడంతో మంచి ఆదరణ లభిస్తోంది. విక్రయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిల్వలను సిద్ధం చేసుకుంటున్నాం.
– చవల బాబురావు, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ
ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాం..
ఇటీవల అంతర్జాతీయ పరిణామాలు వంట నూనెల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో మన దగ్గర నిల్వలను సక్రమంగా వినియోగించుకుంటూనే విదేశాల నుంచి దిగుమతయ్యే నూనెల స్థానంలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నాం. ఎప్పటికప్పుడు మార్కెట్‌ ధరలను సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం
– గిరిజా శంకర్, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube