24 గంటల డెడ్‌లైన్ తాడోపేడో తేల్చుకుంటాం : సీఎం కేసీఆర్
దేశంలో భూకంపం సృష్టిస్తాం -గోయల్ పరుగులు తీయాల్సిందే
24 గంటల డెడ్‌లైన్ తాడోపేడో తేల్చుకుంటాం : సీఎం కేసీఆర్
-దేశంలో భూకంపం సృష్టిస్తాం -గోయల్ పరుగులు తీయాల్సిందే
టీ మీడియా ఏప్రిల్ 11,న్యూఢిల్లీ : కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ, పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలనికోరుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ నుంచి సుమారు 2 వేల కి.మీ. దూరం వచ్చి దీక్ష చేస్తున్నాం. ఇంత దూరం వచ్చి ఆందోళన చేయడానికి కారణమెవరు? నరేంద్ర మోదీ ఎవరితోనైనా పెట్టుకో.. కానీ రైతుల వద్ద మాత్రం పెట్టుకోవద్దు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు. కేంద్రం ధాన్యం కొనాలని ఢిల్లీలో దీక్ష చేస్తున్నాం. దీక్షకు మద్దతిచ్చేందుకు వచ్చిన రాకేశ్ తికాయత్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్.ఉద్యమాల పోరాట ఫలితంగా 2014లో తెలంగాణ వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చాక రైతుల కోసం అనేక సంస్కరణలు తెచ్చామని తెలిపారు. రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించాం. ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. సాగుకు సరిపడా నీటిని అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కోటి ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు.
Also Read : మల్లిఖార్జున్ ఖర్గేను ప్రశ్నిస్తున్న ఈడీ
ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లో విద్యుత్ కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్‌తో కలిసి పని చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకం తికాయత్ వెంట ఉంటుందని చెప్పారు. రాకేశ్ తికాయత్‌ను కేంద్రం ఎన్ని విధాలుగా అవమానించిందో మనమంతా చూశామని తెలిపారు. తికాయత్‌ను దేశద్రోహి అన్నారు.. ఉగ్రవాది అన్నారు. రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకుసాగుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
గోయల్ పరుగులు తీయాల్సిందే
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిలదీశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు.. దమ్ముంటే రండి : సీఎం కేసీఆర్
Also Read : పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న బాలినేని అనుచరులు
దమ్ముంటే రండి
న్యూఢిల్లీ : రాష్ట్ర బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని అంటున్నారు.. దమ్ముంటే రండి అని కేసీఆర్ సవాల్ విసిరారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.కేంద్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ వెళ్లదు.. ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఊరికే మొరగడం సరికాదని కేసీఆర్ అన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్గుండాలి..
కేంద్రం పంట మార్పిడి చేయాలని సూచించినట్లు తాము రైతులకు చెప్పామని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా రైతులు ధాన్యం పండించండి.. మేము కొంటామని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రైతులను రెచ్చగొట్టాడు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని తాము ఢిల్లీలో ధర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్లకు సిగ్గుండాలని కేసీఆర్ విమర్శించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. అంతిమ విజయం సాధించేంత వరకు విశ్రమించేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.