60వేల మంది పోలీసులు 600 కెమెరాలు

60వేల మంది పోలీసులు 600 కెమెరాలు

1
TMedia (Telugu News) :

60వేల మంది పోలీసులు 600 కెమెరాలు
టి మీడియా,జూలై 1,హైదరాబాద్‌ సిటీబ్యూరో, శని, ఆదివారాల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ (హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌)లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరవుతుండటంతో ఆ ప్రాంగణ పరిసరాల్లో దాదాపు 6వేల మంది పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 600 సీసీ కెమెరాలు, అత్యాధునిక టెక్నాలజీతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకునే విధంగా ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను, కెమెరాల వీక్షణ కోసం భారీ తెరలను ఏర్పాటు చేశారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో మూడంచెలు, బయట నాలుగంచెల సెక్యురిటీతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి భద్రత ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

 

Also Read : పోలవరంపై విచారణ చేస్తే జగన్‌ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం
బ్లూ బుక్‌ నిబంధనలు
ఎస్పీజీ(స్పెషల్‌ ప్రొటక్షన్‌ గార్డ్స్‌) అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్లూబుక్‌లో ఉన్న నిబంధనలను పాటిస్తున్నారు. విధ్వంసక నిరోధక జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ప్రత్యేక గార్డ్స్‌, సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు సమకూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర బందోబస్తుకు హాజరవుతున్న అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు.
మోడీ బస ఎక్కడంటే..?
ప్రధాని నరేంద్ర మోడీ భద్రత దృష్ట్యా ఆయన బస, ప్రయాణ మార్గాన్ని ముందుగా వెల్లడించకూడదని పోలీసులు నిర్ణయించుకున్నారు. దాదాపు మూడు మార్గాలు, నాలుగు బస ప్రాంతాలను ఎంపిక చేశారు. వాటిలో ఆయన ఎక్కడ ఉంటారనేది చివరి నిమిషంలోనే తెలుస్తుందని అధికారులు తెలిపారు.

బహిరంగ సభకు 10వేల మందితో భద్రత
హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హైదరాబాద్‌ పోలీసులు దాదాపు 10వేల మంది పోలీసులతో భద్రతను కల్పిస్తున్నారు. ఇక్కడి బందోబస్తు ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్‌ పర్యవేక్షిస్తున్నారు.

 

Also Read : మెట్టు మెట్టు ఎక్కి ‘పది’లో ఫస్ట్ నిలిచాం : మంత్రి హరీశ్ రావు

5 కి.మీ.మేర డేగ కన్ను
సైబరాబాద్‌ పరిధిలోని హెచ్‌ఐఐసీ ప్రాంగణంతో పాటు చుట్టూ 5 కిలోమీటర్ల మేర పోలీసులు డేగ కన్నుతో పహారా కాస్తున్నారు. ఇటీవల శంషాబాద్‌ ప్రాంతం, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాలకు మోడీ హాజరైనప్పుడు తీసుకున్న భద్రత చర్యలతో పాటు తాజాగా సాంకేతికంగా మరికొన్ని అంశాలను చేర్చుకుని పకడ్బందీగా బందోబస్తు ప్రణాళికలను సీపీ స్టీఫెన్‌ రవీంద్ర రూపొందించారు. ఇప్పటికే ఎస్పీజీ అధికారులు హెచ్‌ఐఐసీ ప్రాంగణంతో పాటు మోడీ బస ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పలుమార్లు తనిఖీలతో పాటు రూట్‌ మార్చ్‌ కూడా నిర్వహించారు. సమావేశంలో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి, క్రైం డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్వార్‌, ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌, మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి, బాలానగర్‌ డీసీపీ సందీప్‌, శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, ఈఓడబ్ల్యూ డీసీపీ కవిత, డీసీపీ ఇందిర, స్పెషల్‌ బ్రాంచి డీసీపీ రవికుమార్‌, ఏడీసీపీ రియాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube