తిమ్మాపూర్ ఆలయ అభివృద్ధికి రూ.7 కోట్లు..
-బాన్సువాడ వృద్ధికి రూ.50 కోట్లు
– సీఎం కేసీఆర్
టీ మీడియా, మార్చి1, కామారెడ్డి: తిమ్మాపూర్‌లో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అనంతరం అదే గ్రామంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో సీఎం మాట్లాడుతూ.. గతంలో తాను తిమ్మాపూర్‌కు వచ్చినప్పుడు వేంకటేశ్వస్వామి గుడి ఒక మాదిరిగా ఉండేదని, ఇప్పుడు గుడిచుట్టూ పొలాలు, చెరువుతో ఆహ్లాదకరంగా మారిందని అన్నారు. స్వామివారి కరుణ బాన్సువాడ మీద, యావత్ తెలంగాణ ప్రజానీకం మీద ఉండాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. వేంకటేశ్వర స్వామి గుడి బాగు కోసం రూ.7 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. సమైక్య రాష్ట్రంలో మనం సింగూరు నీళ్లు కోల్పోయామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం చేపట్టడానికిగల కారణాల్లో నిజాంసాగర్ నీళ్లు కూడా ఒకటని అన్నారు. సభాపతి పోచారం అందరికీ ఆత్మీయుడని, అన్ని తెలిసిన వ్యక్తని సీఎం ప్రశంసించారు. ఉద్యమంలో భాగంగా పోచారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. తన నియోజకవర్గ అవసరాల కోసం పోచారం చిన్నపిల్లాడిలా కొట్లాడుతాడన్నారు.
Also Read : ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
ఒక్క బాన్సువాడ ఏరియాలోనే రైతులు రూ.1500 కోట్ల పంట పండిస్తున్నారని స్థానికుల ద్వారా తెలిసిందని సీఎం చెప్పారు. పోచారం నాయకత్వంలో బాన్సువాడ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిందని, ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందడం కోసం సీఎం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.50 కోట్ల నిధులు కేటాయిస్తున్నానని ప్రకటించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం అందరికీ రాదని, తనకు తన ధర్మ పత్నితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన శ్రీనివాస్‌రెడ్డికి, ఆయన ధర్మపత్నికి, ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube