ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం
-విమానాల రాకపోకలు నిలిపివేత
టీ మీడియా, అక్టోబర్ 11, లండన్: లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం ఎయిర్‌పోర్ట్‌లోని కారు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర వాహనాలకు కూడా అంటుకోవడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో పార్కింగ్ పైకప్పు పాక్షికంగా కూలిపోయింది. ఈనేపథ్యంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల విమానాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ సిబ్బంది మంటలను ఆర్పడానికి, విమానాశ్రయంలోని ఇతర భవనాలు, వాహనాలకు మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి కృషి చేస్తున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.