విస్తారంగా కురుస్తున్న వానలు

మరో మూడు రోజులు భారీ వర్షం

1
TMedia (Telugu News) :

విస్తారంగా కురుస్తున్న వానలు

-మరో మూడు రోజులు భారీ వర్షం
-అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం
టి మీడియా,జులై 8,హైదరాబాద్‌: అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. అక్కడడక్కడా వరదలు పోటెత్తాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వాన దంచికొట్టింది. వర్షాలకు నల్లగొండలో ఓ ఇళ్లు కూలడంతో తల్లీకూతుళ్లుమృతిచెందారు.హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్‌, అమీర్‌పేట్‌, నాంపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంటల్లో చిరుజల్లులు పడుతుండగా.. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి నగర్‌, పెద్దఅంబర్‌పేట, తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తున్నది.ఉమ్మడి ఖమ్మం జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. ఇల్లందు సింగరేణి ఏరియాలో ఏకధాటిగా వర్షం కురియడంతో ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండాల్లో వాన దంచికొడుతున్నది.భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టులోకి పెద్దఎత్తున వరద వచ్చిచేరుకున్నది.

 

Also Read : ఖాకీలపై మూడో కన్ను

 

దీంతో అధికారులు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి నీటిని వదిలేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రతస్తుతం 36 వేల క్కుసెక్కుల నీరు వస్తుండగా, 56 వేల క్కుసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.జయశంకర్‌ జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గవ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. వర్షంతో భూపాలపల్లి కాకతీయ ఉపరితల గనుల్లో బోగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో వర్షం ధాటికి ఓ ఇళ్లు కూలడంతో లక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది.సూర్యాపేట జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది. భారీ వర్షానికి సంగం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో కోడూరు, సూర్యాపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 190.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. తుంగతుర్తిలో 139.5, నడిగూడెంలో 132.7, మోతెలో 121.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నల్లగొండ జిల్లా అంతటా విస్తారంగా వర్షం కురుస్తున్నది. నల్లగొండ పట్టణంలోని పానల్ బైపాస్‌ రోడ్డుపై భారీగా వరద నీరు పారుతున్నది. పలు మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. నరికేకల్‌లో అత్యధికంగా 93.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కేతెపల్లిలో 76.9, కట్టంగూరులో 76.4, శాలిగౌరారంలో 74, నల్లగొండలో 71.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం రికార్డయింది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube