విజయవాడ బస్టాండ్‌లో ప్రమాదం..
– ప్లాట్ ఫాంపై దూసుకెళ్లిన బస్సు
– ముగ్గురు మృతి
టీ మీడియా, నవంబర్ 6, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో 12వ ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మృతిచెందారు. మరణించినవారిలో కండక్టర్‌తోపాటు ఓ మహిళ, బాలుడు ఉన్నారు. పలువురు గాయపడ్డారు. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గుంటూరు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు ఒక్కసారిగా 12వ నంబర్ ప్లాట్‌ఫామ్ పైకి దూసుకొచ్చింది. దీంతో కండక్టర్‌తోపాటు అక్కడ ఉన్న మరో ఇద్దరు మరణించారు. పలువురు బస్సు కింద ఇరుక్కుపోయారు. తక్షణమే స్పందించిన సిబ్బంది.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్లాట్‌ఫామ్ 11, 12 వద్ద ఫెన్సింగ్, కుర్చీలు ధ్వంసమయ్యాయి. మృతులను బస్సు కండక్టర్ వీరయ్య, ప్రయాణికురాలు కుమారి, ఆమె మనవడు అయాన్‌గా గుర్తించారు. కుమారి కోడలు సుకన్యకు కాలు విరిగిపోయింది. కాగా, డ్రైవర్ రివర్స్ గేరుకు బదులు ఫస్ట్ గేర్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. బస్సు ప్రమాదం దురదృష్టకరమని చెప్పారు.
Also Read : బ్రిడ్జిపైనుంచి రైల్వే ట్రాక్‌పై పడిన బస్సు..
బస్సు కండిషన్ బాగానే ఉందని వెల్లడించారు. ఇది మానవ తప్పిదమా లేదా సాంకేతిక తప్పిదమా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, 24 గంటల్లోపు విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్ వయస్సు 61 ఏండ్లు అని, ఈ మధ్యే అనారోగ్యానికి గురై కోలుకుని డ్యూటీలో చేరాడని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube