అదానీ అవుట్‌..?

'డేటా సెంటర్‌' భూ కేటాయింపులపై సర్కారు వెనకడుగు

0
TMedia (Telugu News) :

అదానీ అవుట్‌..?

-‘డేటా సెంటర్‌’ భూ కేటాయింపులపై సర్కారు వెనకడుగు

టీ మీడియా, ఫిబ్రవరి 24,విశాఖ బ్యూరో : గౌతమ్‌ అదానీ డొల్ల కంపెనీలపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్టు నేపథ్యంలో విశాఖలో అదానీకి జరిపిన భూకేటాయింపులపై ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. విశాఖలో మార్చి మూడు, నాలుగు తేదీల్లో గ్లోబల్‌ ఇన్విస్టెమెంట్‌ సమ్మిట్‌ జరుగనున్న దృష్ట్యా అదానీ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఇది వరకే ఖరారు చేశారు. అయితే అంతర్జాతీయంగా అదానీ డొల్ల కంపెనీలపై విమర్శలు రావడంతో శంకుస్థాపనను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. విశాఖ భూ ప్రాజెక్టుకూ జాతీయ బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్లు ఎపిఐఐసి అధికారుల ద్వారా తాజాగా తెలిసింది. బిజెపి సర్కారు కనుసైగతో రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం పోర్టులు, ఆయిల్‌ కంపెనీలతో అక్రమ ఒప్పందాలు, భూముల కేటాయింపులతో అనుచిత లబ్ధిని చేకూర్చిన వైనంపై జగన్‌ సర్కారు తాజాగా బోనులో నిలబడింది.

Also Read : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ

ఇదివరకే విశాఖలోని మధురవాడ సర్వే నెంబరు 409లో 130 ఎకరాలను ‘అదానీ గ్రూప్‌ డేటా ఎనలటిక్స్‌ సెంటర్‌ (డిఎసి)’ కోసం చేసిన అక్రమ భూ కేటాయింపుల విషయం తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. మధురవాడ, కాపులుప్పాడ వంటి చోట్ల గజం స్థలం రూ.లక్షకు పైగా పలుకుతున్న నేపథ్యంలో రూ.4 వేల కోట్లకు పైగా ఉన్న స్థలాన్ని కేవలం రూ.130 కోట్లుకే కారుచౌకగా అదానీ డేటా సెంటర్‌ కోసం జగన్‌ ప్రభుత్వం ఇచ్చేసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 2012 సెప్టెంబర్‌ 14 నాటి జిఒ ఎంఎస్‌ 571 ద్వారా నోటిఫై చేసిన భూ వినియోగ విధానం ప్రకారం చూస్తే ప్రజాప్రయోజనాల కోసం ప్రైవేట్‌ ఏజెన్సీలు, సంస్థలకు లీజుకు ఇచ్చిన భూమికి సంవత్సరానికి లీజు, అద్దె దాని మార్కెట్‌ విలువలో 10 శాతం కంటే తక్కువగా ఉండకూడదు. దీని ప్రకారం చూసుకున్నా సరే ఏటా రూ.400 కోట్లును డేటా సెంటర్‌ నుంచి రాబట్టాల్సి ఉంది. కానీ ప్రభుత్వం రూ.130 కోట్లకు 130 ఎకరాలనూ కేటాయించడం ఏ చట్టం ప్రకారం చేసింది ? సహజ వనరులను ప్రైవేట్‌ వ్యక్తులకు ఎలా కట్టబెట్టింది ? అన్న ప్రశ్నలకు ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

Also Read : వైద్య విద్యార్థిని ప్రీతికి వేధింపులు..

ఎపిఐఐసి అధికారులు ఏమంటున్నారంటే..
ఈ నెల 3న అదానీ డేటా సెంటర్‌కు మధురవాడలో 130 ఎకరాల్లో శంకుస్థాపన చేయడానికి ఇదివరకే సన్నాహాలు మొదలయ్యాయని, ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌, అదానీ వ్యవహారంపై అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఆ కార్యక్రమం విశాఖలో రద్దయిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్‌ ఇటీవల అమల్లోకి రాగా రెండు నెలల క్రితమే గ్లోబల్‌ సమ్మిట్‌ విశాఖలో నిర్వహిస్తున్న నిర్ణయం జరిగి పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి. అదానీ ప్రాజెక్టు మాత్రమే అటకెక్కడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందన్నది స్పష్టంగా తెలుస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube