అదానీ స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకు కాషాయ పార్టీ కుయుక్తులు
– ఆప్
టీ మీడియా, ఏప్రిల్ 26, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణ ఖర్చుపై ఆప్, బీజేపీల మధ్య డైలాగ్ వార్ ముదిరింది. లగ్జరీ బంగళా కోసం కేజ్రీవాల్ రూ. 45 కోట్ల ప్రజాధనం వెచ్చిస్తున్నారని, ఇందులో వియత్నాం మార్చుల్స్, ఖరీదైన కర్టెన్స్, హైఎండ్ కార్పెట్లు వాడుతున్నారని కాషాయ పార్టీ దుయ్యబట్టింది. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తాము నిరాడంబరంగా, నిజాయితీగా వ్యవహరిస్తామని ఇచ్చిన హామీని కేజ్రీవాల్ తుంగలో తొక్కారని బీజేపీ ప్రతినిధి సంబిట్ పాత్రా ఆరోపించారు. కేజ్రీవాల్ తన నివాసంలో ఖరీదైన వస్తువులు, అలంకారాల కోసం వెచ్చిస్తున్న తీరు చూసి రాజులు సైతం ఢిల్లీ సీఎంకు సలాం చేస్తారని ఆయన మహారాజులా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత విరుచుకుపడ్డారు. అయితే కాషాయ పార్టీ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది. కాషాయ పార్టీకి దీటైన కౌంటర్ ఇస్తూ ఆప్ చీఫ్‌ను పార్టీ సమర్ధించింది. ఢిల్లీ సీఎం నివాసం 80 ఏండ్ల కిందట నిర్మించిందని, ఆడిట్ అనంతరం భవనం పునరుద్ధరించాలని ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) సూచించిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. పకీరునని చెప్పుకునే ప్రధాని మోదీ ప్రధాని నివాసం కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని సింగ్ ఎద్దేవా చేశారు. కొవిడ్ సమయంలో ప్రధాని మోదీ తన పర్యటనల కోసం రూ. 8400 కోట్లతో విమానం కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ రోజులో చాలా సార్లు తన దుస్తులు మార్చేస్తారని అన్నారు. మోదీ షెహన్‌షా-ఈ-ఆలంలా నివసిస్తారని ఆరోపించారు. అదానీ స్కామ్ వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.