అడెనోవైరస్‌.. 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి

అడెనోవైరస్‌.. 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి

0
TMedia (Telugu News) :

అడెనోవైరస్‌.. 24గంటల్లో ఏడుగురు చిన్నారులు మృతి

టీ మీడియా, మార్చ్ 2, పశ్చిమ బెంగాల్‌ : గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అడోనోవైరస్‌ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. వైరస్‌ కారణంగా రెండేండ్ల లోపు చిన్నారులు ఆసుపత్రిపాలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా, గత 24 గంటల్లో అడోనోవైరస్‌ కారణంగా ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. ‘గత 24 గంటల్లో వైరస్‌ కారణంగా ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ కారణంగా 12 మంది మరణించారు. వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించాం. వైరస్‌ లక్షణాలతో ఉన్న వారి నమూనాలను పరీక్షల కోసం పంపాం. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది’ అని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో గత నెలలో 5,213 ఏఆర్‌ఐ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణమని.. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని చెప్పారు. పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 121 ఆసుపత్రుల్లో 600 మంది పిల్లల వైద్యులతో పాటు 5,000 పడకలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.

Also Read : నాగాలాండ్‌ అసెంబ్లీలోకి మొదటిసారి మహిళా ఎమ్మెల్యే..

ఇదిలాఉండగా.. రాష్ట్రంలో అడెనో వైరస్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులతో చర్చించి.. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వైద్య సిబ్బంది, ఇతర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర హెల్ప్‌లైన్ 1800-313444-222 నెంబర్లను ప్రకటించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube