ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు

0
TMedia (Telugu News) :

ట్రావెల్స్‌ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు

టి మీడియా, మే 15,పర్చూరు: (మార్టూరు): సొంతూరిపై మమకారం… ఓటు వేయాలని దృఢ సంకల్పం..పిల్లాజెల్లాతో ఇంటిల్లిపాదీ స్వస్థలాలకు విచ్చేశారు.. త్రికరణ శుద్ధితో బాధ్యతను నిర్వర్తించారు. బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే కొండంత ఆశతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు.. టిప్పరు రూపంలో దూసుకొచ్చి.. బస్సు డ్రైవరుతో సహా నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచేలోపే.. అగ్నికీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలపాలుజేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై.. 108, పోలీసులకు సమాచారం చేరవేశారు.స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు… బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్‌.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి.. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి.

 

ALSO READ :ఆపదలో అయ్యగారు ఆధుకోండి అంటూ వేడుకోలు

FIRING
FIRING

 

ACCSIDENT
ACCSIDENT

 

తేరుకునేలోపే తెల్లారిన బతుకులు

ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్‌ బస్సు చోదకుడు.. మరో నలుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా.. చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి.. 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్‌ వర్క్‌ జరుగుతుండటం.. తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం.. టిప్పర్‌ వేగంగా దూసుకురావడం.. టిప్పర్‌ చోదకుడు వేగాన్ని నియంత్రించ లేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube