“ఆక్షరాలతోవ” లో సాహితీ సేద్యం
‘అక్షరాల తోవ’లో సాహితీ సేద్యం
ఔత్సాహిక కవులకు నిత్య ప్రోత్సాహం
తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్న ముగ్గురు సాహితీ మిత్రులు
ఖమ్మం : తేనేలూరే తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తూ, సాహితీ సేద్యం గావిస్తూ.. వర్ధమాన, ఔత్సాహిక రచయితలకు, కవులకు ప్రోత్సాహం అందిస్తూ అక్షరాల తోవ సాహితీ సంస్థ పరిఢవిల్లుతోంది. 2017 అక్టోబర్ 19న దీపావళి రోజు ఈ అక్షరాల తోవ సాహితీ సంస్థను సీనియర్ జర్నలిస్టు నామా పురుషోత్తం, ప్రముఖ కథా రచయిత రాచమళ్ల ఉపేందర్, కవి, లఘుచిత్రాల దర్శకుడు దాసరోజు శ్రీనివాస్ ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నిరాటంకంగా సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికి అక్షరాల తోవ రెండు వార్షికోత్సవాలను కవుల మధ్య ఘనంగా జరుపుకుంది.
సాహిత్యంపై ఆసక్తితో, సాహిత్యం ద్వారా సమాజ మార్పు నాంది పలకాలనే ఉద్ధేశంతో ముగ్గురు మిత్రులు ఈ అక్షరాల తోవను ప్రారంభించిన రెండేళ్లలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆర్థికంగా భారమైనా కార్యక్రమాల నిర్వహణకు వెనుకంజ వేయకపోవడం గమనార్హం. పుస్తక పరిచయ సభలు, కవితలు, కథల పోటీలు నిర్వహిస్తూ కవులను, రచయితలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆదివారం ఉత్తమ కవితల పోటీ పేరిట వారం వారం వాట్సప్ గ్రూపు వేదికగా కవితల పోటీ నిర్వహించి విజేతలైన కవులందరికీ ఖమ్మంలో అభినందన సభ ఏర్పాటు చేసి సత్కారం అందచేశారు. తొలుత ఖమ్మం జిల్లా స్థాయిగా ప్రారంభమైన పోటీ అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎదిగి, జాతీయస్థాయిలో పోటీలు నిర్వహించారు. బెంగుళూరు, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని తెలుగు కవులు కూడా ఈ పోటీలకు కవులు కవితలు పంపడం గమనార్హం.
వ్యంగ్య కవితల పోటీ నిర్వహణ (సగంమాది… సగం మీది) :
సగం మాది… సగం మీది… అనే శీర్షికతో నాలుగు లైన్లు ఇచ్చి దానికనుగుణంగా వ్యంగ్య కవిత రాసే పోటీకి అక్షరాల తోవ పూనుకుంది. దీనికి కవుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ పోటీ 6 నెలల పాటు నడిచింది. విజేతలకు ఖమ్మంలో అభినందన సభ ఏర్పాటు చేసి సత్కరించారు.
‘వురిమళ్ల’ పురస్కారాలు ప్రదానం :
వురిమళ్ల సునంద, భోగోజు ఉపేందరావు ఆర్థిక సహకారంతో అక్షరాల తోవ ఆధ్వర్యంలో వురిమళ్ల పద్మజ స్మారక కవితల, వురిమళ్ల శ్రీరాములు స్మారక కథల పోటీ నిర్వహించారు. దీంతోపాటు భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం’ పేరిట భద్రాచలానికి చెందిన అభినవ మొల్ల చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కథల పోటీ విజేతగా ప్రముఖ సినీ హాస్య నటులు జెన్నీ(పోలాప్రగడ జనార్ధనరావు) గారు నిలిచి ఖమ్మంలో అవార్డు అందుకున్నారు.
గురువారం ఓ గంట – సాహిత్యమేనంట :
నిత్యం కవిత్వం రాసేలా కవులను ప్రేరేపించేందుకు ప్రతి గురువారం సాయంత్రం ‘గురువారం ఓ గంట – సాహిత్యమేనంట’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కవి తను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరడానికి కవిత్వం, కథ, పాట వివిధ సాహిత్య ప్రక్రియలలో పడిన ఘర్షణ, తపన అందరికీ తెలియాలనే ఉద్ధేశంతోనూ, కవి మనసులోని భావాన్ని మరొకరు వినడం ద్వారా ఉత్తేజితులు, ప్రేరేపితులు కావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు.
అక్షరయోధునితో ఆత్మీయ కలయిక :
సాహిత్యంలో విశేష కృషి గావించి, భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకంగా నిలిచిన… సాహితీవేత్తలను స్వయంగా వారింటికి వెళ్ళి, ఈ ముగ్గురు మిత్రులు వారి సాహిత్య ప్రయాణం గురించి ఇంటర్వ్యూ చేసేవారు. ఆ సాహితీమూర్తి యొక్క రచనా వ్యాసాంగంలో అనుభవాలను, సలహాలను, యువ రచయితలకు, కవులకు ఇచ్చే సూచనలను బాహ్యా ప్రపంచానికి చేరవేయడంలో విశేష కృషి గావించారు.
బాల సాహిత్యాభివృద్ధికి ప్రత్యేక కృషి :
జిల్లాలో బాల సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు అక్షరాల తోవ ప్రత్యేక కృషి సల్పింది. ఇప్పటికే జిల్లాలో కొంతమంది ఉపాధ్యాయులైన కవులు తమ విద్యార్థులతో కవిత్వాన్ని రాయించి పుస్తకాలు ప్రచురించారు. వారందరినీ అభినందిస్తూ వారితో ఖమ్మంలోని సర్వజ్ఞ పాఠశాలలో బాల సాహిత్య సదస్సు నిర్వహించారు. సుమారు వంద మంది విద్యార్థులు ఈ సదస్సుకు హాజరు కావడం గమనార్హం. గత ఏడాది ఏప్రియల్ నెలలో సర్వజ్ఞ పాఠశాలలో ఐదు రోజుల పాటు కవిత, కథ, పాటలు రాయడంపై నిష్ణాతులైన రచయితలతో వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రయివేట్, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఐదు రోజుల పాటు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరోజు కారోజు పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమనికి రెజొనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ ఆర్‌వి నాగేందర్‌కుమార్ సహకారం మరువలేనిది.
తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో గత ఆగష్టు నెలలో ‘బాలసాహిత్య కథా కార్యశాల’ నిర్వహించారు. కథా రచనలో మెలకువలు, కథలు రాయడంలో ఉద్దేశం, బాలసాహిత్యం ఆవశ్యకత అనే అంశాలపై ప్రముఖ కవులు సీతారాం, విఆర్‌శర్మ, అమ్మిన శ్రీనివాసరాజు, రాచమళ్ల ఉపేందర్ బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత అట్లూరి వెంకటరమణ, వురిమళ్ల సునంద, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, సయ్యద్ షఫీ, కొమ్మవరపు కృష్ణయ్య, గద్దపాటి శ్రీనివాస్, వేము రాములు, జిగీష, మనోరమ, జెవివి రాష్ట్ర నాయకులు అలవాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘నెలకో బడి- అక్షరాల ఒడి’ కార్యక్రమానికి శ్రీకారం :
బాల సాహిత్యాభివృద్ధి కృషిలో భాగంగా ప్రతి నెల మూడో శనివారం 7వ తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు సాహిత్యంపై అవగాహన పెంచేందుకు ‘నెలకో ఒడి – అక్షరాల ఒడి’ అనే కార్యక్రమానికి అక్షరాల తోవ శ్రీకారం చుట్టింది. మొదటగా బోనకల్ మండలం చిరునోముల హైస్కూల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. కవిత, కథలు, పాటలు రాయడంపై అవగాహన పెంచడంతో పాటు అక్కడికక్కడే పోటీ నిర్వహించి బహుమతులు అందచేసి విద్యార్థుల్లో సాహిత్యాభిరుచిని పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.
క్లైమాక్స్ కథల పోటీ :
కథా రచనకు ప్రాధాన్యతనిస్తూ ‘క్లైమాక్స్ కథల పోటీ’ నిర్వహించింది అక్షరాల తోవ. కథకు క్లైమాక్స్ అందించి దానికి సరిపడే ప్రారంభంతో పాటు కథను అందించాలని ఆహ్వానించడంతో కథా రచయితల నుండి అనూహ్య స్పందన లభించింది. సాహిత్యంలోనే ఇది సరికొత్త ఒరవడి. ఓ కథకు చివరి అంకం ఇవ్వడం, దాని ఆధారంగా కథ అల్లించేలా చేయడం అది అక్షరాలతోవకే సాధ్యమైంది. ఈ పోటీల్లో లబ్ధప్రతిష్టులైన కవులు పాల్గొనడం ముదావహం. విజేతలకు అభినందన సభ ఏర్పాటు చేసి వారిని అక్షరాల తోవ నిర్వాహకులు సత్కరించారు.
ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పుస్తకాలు ప్రచురణ :
గత నవంబర్‌లో అక్షరాల తోవ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. వార్షికోత్సవం సందర్భంగా కవితల, కథలను పుస్తకరూపంగా తీసుకొచ్చారు. ప్రథమ వార్షికోత్సవ సందర్భంగానూ కవితల, కథల పుస్తకాన్ని తీసుకొచ్చారు. ద్వితీయ వార్షికోత్సవంలో ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య, బిసి కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్, కాళోజీ అవార్డు గ్రహీత సీతారాం, ప్రముఖ కవులు మువ్వా శ్రీనివాసరావు, వురిమళ్ల సునంద, కన్నెగంటి వెంకటయ్య, హార్వెస్ట్ విద్యాసంస్థల అధినేత రవిమారుత్, మున్సిపల్ ఆర్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పాటమ్మా వందనం… :
వర్ధమాన గాయకులతో పాటు కొత్తగా ఆలపిస్తున్న వారిలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు అక్షరాలతోవ ‘పాటమ్మా వందనం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎంతటివారినైనా పాట కదిలిస్తుంది. ఆలోచింపచేస్తుంది. అందుకే పాటకు పట్టం కడుతూ అక్షరాలతోవ చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజా వాగ్గేయకారులు మేడగాని శేషగిరి, కన్నెగంటి వెంకటయ్య పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఈ కార్యక్రమం నిరంతరం సాగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా ఉన్న నల్ల కృష్ణ పాల్గొని చెట్టుపై చక్కటి పాట పాడి అందరినీ అలరించారు.
కొత్తగా ‘స్టార్ ఆఫ్ ది వీక్’ .. :
అక్షరాల తోవ వాట్సాప్ గ్రూపులో ఆదివారం నుండి శనివారం వరకు రాసిన కవితల్లో మెరుగైన వాటిని ఎంచుకుని ఆ కవిని ‘స్టార్ ఆఫ్ ది వీక్’గా ప్రకటిస్తూ కవులను అక్షరాలతోవ ప్రోత్సహిస్తోంది. కవిత్వం, కథలతో పాటు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో రాసిన వాటిని పరిశీలిస్తూ కవుల ప్రతిభ ఆధారంగా వారం వారం ‘స్టార్ ఆప్ ది వీక్’గా ప్రకటిస్తూ సరికొత్త కార్యక్రమానికి అక్షరాలతోవ శ్రీకారం చుట్టింది. దీనికి ప్రముఖ కవుల నుండి స్పందన లభిస్తోంది. వారం వారం కవులంతా పోటీపడుతూ చక్కటి, చిక్కటి కవిత్వాన్ని అందిస్తున్నారు.
సాహిత్యంపై అభిరుచితో… : నిర్వాహకులు నామా పురుషోత్తం, రాచమళ్ల ఉపేందర్, దాసరోజు శ్రీనివాస్
సాహిత్యంపై అభిరుచితో అక్షరాల తోవ సంస్థను ఏర్పాటు చేసి అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా వెరవక సాహిత్యాభివృద్ధికి పాటుపడుతున్నాం. వర్థమాన, ఔత్సాహిక రచయితలు, కవులకు ప్రోత్సాహం అందించడం మా ప్రధాన ఉద్ధేశం. ఇప్పటి వరకు చాలా మంది కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు మా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. వారందరికీ సాహిత్యాభివందనాలు. భవిష్యత్‌లోనూ ఖమ్మం కేంద్రంగా అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తాం.