ఆదర్శ విద్యార్థి
లహరి, ఫిబ్రవరి 13, కల్చరల్ : సంవత్సరం మధ్యలో ఆనంద్ ఏడవ తరగతిలో చేరాడు. అందరికంటే చిన్నవాడని అందరూ ‘తమ్ముడూ…!’ అనేవారు. ‘ఒరేరు! నువ్వింత చిన్నగా ఉన్నావు. మాతో పోటీగా పరీక్షలు రాసి నెగ్గగలవా? అని గేలి చేసేవారు. గెలిస్తే నీకు మంచి బహుమతి ఇస్తాం’ అని సవాలు చేసేవారు. ఆనంద్ మాత్రం ఎవరినీ ఏమనకుండా, అందరితో చక్కగా మాట్లాడేవాడు.పరీక్షలు రానే వచ్చాయి. ‘ఏరా పందెం గుర్తుందా’ అని తోటివారు ఎగతాళి చేస్తున్నా పట్టించుకోకుండా ఆనంద్ పరీక్షలు రాశాడు. పరీక్ష ఫలితాల్లో అగ్రగామిగా నిలిచాడు. పిల్లలంతా సిగ్గుతో తలొంచుకున్నారు. బడి అయ్యాక ‘తమ్ముడూ! నువ్వు ఏడాది మధ్యలో చేరావు కదా! అయినా మొదటి స్థానంలో ఎలా వచ్చావు’ అని ప్రశ్నించారు. దానికి ఆనంద్ ‘అన్నయ్యలు, నేను కష్టపడి కాదు, ఇష్టపడి చదువుతాను. అలాగే నన్ను ఎగతాళి చేసినా పట్టించుకోను’ అని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆనంద్‌ను ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులంతా ఎంతో ఇష్టంగా చదివేవారు. మంచి ర్యాంకులు సాధించేవారు. వాళ్ల ఊరికి, పాఠశాలకు, తల్లిదండ్రులకూ మంచి పేరు తెచ్చిపెట్టారు.