దేశంలో కొనసాగుతున్న ఆటవిక రాజ్యం
-సీపీఐ నేత కూనంనేని
టీ మీడియా ,నవంబర్ 24,హైదరాబాద్ : దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీలను ప్రయోగిస్తుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారిపై ఒక్క దాడైనా జరిగిందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటివరకు మూడు వేల ఈడీ కేసులు నమోదయ్యాయని చెప్పారు. వాటిలో ఒక్కటి కూడా నిరూపితం కాలేదని చెప్పారు. రాజకీయ కక్షతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాన నేరస్తుడు పీఎం మోదీయేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
Also Read : ఆదిలాబాద్‌లో పంజా విసురుతున్న చలి
ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అజ్ఞాని అని, ఆయన నటన ముందు ఎవరూ సరిపోరని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్‌కు నోటిసులిస్తే ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరవరరావులాంటి వారిని జైల్లో పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. సంతోష్ ఏమైనా దేవుడా.. నోటిసులిస్తే తప్పేంటని నిలదీశారు. సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం అధికారులకు ప్రశ్నించే అధికారం ఉందని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా విచారించాలని సిట్ అధికారులను విజ్ఞప్తి చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube