మత్స్య అలంకరణలో భక్తులకు అభయమిచ్చిన యాదగిరీశుడు
లహరి, పిబ్రవరి 23, యాదాద్రి : యాదగిరి గుట్ట లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం లక్ష్మీనరసింహ స్వామి వారు మత్స్య అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని యాదగిరీశుడిని దర్శించుకున్నారు. శ్రీదేవి, భూదేవితో భగవంతుడు ఆదిశేషుడిపై విహరిస్తూ తీర్థ జనానికి ఆహ్లాదాన్ని అందించే అలంకారోత్సవాలు శేషవాహనంపై రాత్రి 7 గంటలకు ఊరేగిస్తారు.ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ప్రధానాలయంలో ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం.. సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవన కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజా కైంకర్యాలు, నరసింహ స్వామి నామస్మరణలతో గుట్ట మార్మోగుతోంది.