అమ్మవారి పంచమితీర్థంకు టీటీడీ సకల ఏర్పాట్లు

అమ్మవారి పంచమితీర్థంకు టీటీడీ సకల ఏర్పాట్లు

1
TMedia (Telugu News) :

అమ్మవారి పంచమితీర్థంకు టీటీడీ సకల ఏర్పాట్లు

లహరి, నవంబరు 26, తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన పంచమితీర్థం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి అమ్మవారి గరుడ వాహన సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబరు 28వ తేదీ సోమవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పంచమితీర్థం చాలా విశిష్టమైనదని చెప్పారు. సోమవారం ఉదయం 11.40 గంటల నుంచి 11.50 గంటల మధ్య పుష్కరిణిలో పంచమితీర్థం చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కరోనా అనంతరం నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల్లో పంచమితీర్థంకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని, అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Also Read : పీఎస్‌ఎల్‌వీ-సీ54 ప్రయోగం విజయవంతం

తిరుచానూరులోని అయ్యప్ప ఆలయం, జెడ్‌పీ హైస్కూల్‌, పూడి రోడ్డు వద్ద భక్తుల విశ్రాంతి కోసం జర్మన్‌ షెడ్లు ఏర్పాటుచేశామన్నారు. ఈ ప్రాంతాల్లో భక్తులకు ఆదివారం రాత్రి నుంచే అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ అందుబాటులో ఉంచుతామని, భక్తులకు అవసరమైన తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. భక్తుల భద్రత కోసం 2,500 మంది పోలీసు బలగాలతో పాటు టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ సిబ్బందితోపాటు దాదాపు 1000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తారని తెలిపారు. భక్తులందరూ ఓపికగా ఉండి అధికారులకు సహకరించి పుష్కరిణిలో పుణ్య స్నానం చేయాలని ఆయన కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube