విరసం నేత వరవరరావుకు ‘సుప్రీం’ బెయిల్‌

విరసం నేత వరవరరావుకు ‘సుప్రీం’ బెయిల్‌

1
TMedia (Telugu News) :

విరసం నేత వరవరరావుకు ‘సుప్రీం’ బెయిల్‌
టీ మీడియా, ఆగస్టు 10,న్యూఢిల్లీ : విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్‌‌ కేసులో ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ వరవరరావు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు యూయూ లలిత్‌, అనిరుద్ధ బోస్‌, సుధాన్షు ధూలియా ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విరసం నేత ఆరోగ్య పరిస్థితి, రెండున్నర సంవత్సరాల కస్టడీ కాలాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, చార్జీషీట్‌ దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం పేర్కొంది. అయితే, ముంబైలోని ఎన్‌ఐఏ కోర్ట్‌ అనుమతి లేకుండా ఆయన గ్రేటర్‌ ముంబయిని దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది.

 

Also Read : గాంధీ సినిమా విద్యార్థులకు స్పూర్తి

 

అలాగే ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పింది.భీమా కోరెగావ్‌ కేసులో ఆగస్ట్‌ 28, 2018న వరవరరావును అరెస్టు చేశారు. అదే ఏడాది నవంబర్‌లోముంబయిలోని తలోజా జైలుకు తరలించారు. 2020లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫిబ్రవరి 2021లో హైకోర్టు ఆయనకు ఆరు నెలల మెడికల్‌ బెయిల్‌ను మంజూరు చేస్తూ.. శాశ్వత బెయిల్‌కు నిరాకరించింది. ఆ తర్వాత మెడికల్‌ బెయిల్‌ను తాత్కాలికంగా మూడు నెలలు పొడిగించింది. మూడు నెలల తర్వాత జైలులో లొంగిపోవాలని చెప్పింది. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube