బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం
రంగురంగుల వెలుగులతో ముస్తాబైన కారేపల్లి పెద్ద చెరువు
దారి పొడవునా డూమ్ లైట్లు..
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సర్పంచ్ టోనీ
టీ మీడియా,అక్టోబర్17,సింగరేణి(కారేపల్లి):బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు కారేపల్లి పెద్ద చెరువు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సింగరేణి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.బతుకమ్మలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చే మహిళలు,గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సింగరేణి సర్పంచ్ మేధరి వీర ప్రతాప్ (టోనీ) దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.పెద్ద చెరువు ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.ముఖ్యంగా కారేపల్లి నుంచి పెద్ద చెరువు వరకు వెళ్లే దారి పొడవునా డూమ్ లైట్లను ఏర్పాటు చేసి వెలుగులు నింపారు.రాత్రివేళల్లో చెరువు వద్దకు వచ్చే మహిళలు,ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన వెలుతురు ఉండేలా చర్యలు చేపట్టారు.చెరువు ప్రాంగణంలో బతుకమ్మలు ఆడేందుకు అనువుగా ఏర్పాట్లు చేశారు.తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాలతో జరుపుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ టోనీ తెలిపారు.బతుకమ్మలతో వచ్చే ఆడపడుచులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రంగురంగుల వెలుగులతో పెద్ద చెరువు ప్రాంగణం ముస్తాబు కావడంతో పండుగ వాతావరణం నెలకొంది.



