భారీ వర్షాలు అధికారులు అప్రమత్తంగా ఉండండి

మంత్రి పువ్వాడ అజయ్

1
TMedia (Telugu News) :

భారీ వర్షాలు అధికారులు అప్రమత్తంగా ఉండండి

-మంత్రి పువ్వాడ అజయ్

-సీఎం కేసిఆర్ ఆదేశాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నాను

– అధికారులతో టెలిఫోన్ కాన్ఫరెన్స్

టీ మీడియా, సెప్టెంబర్ 13, ఖమ్మం : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అదేశించారు. సోమవారం జిల్లాల క‌లెక్టర్లు, ఇత‌ర శాఖ‌ల‌ అధికారులతో మంత్రి టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకొని అధికారులను మంత్రి అజయ్ ఆరా తీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గోదావరి నది ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని, జన జీవనానికి ఆటంకాలు తలెత్తకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.

Also Read : మూసుకుపోతున్న రహదారులు

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని అధికారులను సన్నద్ధంగా ఉంచామని, ఎప్పటికప్పుడు పరిస్థితులను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి అజయ్ తెలిపారు.జిల్లాలలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటిమట్టాలు, ముంపు పరిస్థితుల గురించి మంత్రి అజయ్ ఆరా తీశారు. వివిధ శాఖల అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అవసరమైనచోట వినియోగించి రక్షణ చర్యలను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాలు తగ్గించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయి అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజల అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 08744-241950, 08743-232444కు కాల్‌ చేసి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.

Also Read : ఎమ్మెల్సీ కవిత కరోనా

వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధికారులు కూడా సమాయత్తమై ఉండాలని ఆదేశించారు. ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్తమై ఇటీవల వరదలప్పుడు చేపట్టినట్టే చర్యలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర సేవలందించే శాఖలతోపాటు వానలు, వరదల సందర్భంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అన్ని శాఖల అధికారులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని మంత్రి స్పష్టంచేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube