మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉంటున్నారా.?
– ఈ తప్పులు చేయకండి
లహరి, ఫిబ్రవరి 17, ఆధ్యాత్మికం : శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ఈ పర్వదినాన ఉపవాసం, జాగరణ చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు. అందుకే శివరాత్రి నాడు నిష్టతో ముక్కంటిని ఆరాధిస్తారు. ఓం నమఃశివాయ అని స్మరించుకుంటూ పగలంతా ఉపవాస దీక్షలో.. సాయంత్రం దైవ చింతలో మునిగిపోతారు. అయితే శివానుగ్రహం కోసం చేసే ఈ దీక్ష సమయంలో చాలా నిష్టగా ఉండటంతో పాటు కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే కోరిన కోర్కెలు నెరవేరతాయి. తెలిసీ తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా ఉపవాసం ఉన్న ఫలం కూడా దక్కదు. అందుకే శివ పూజ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అభిషేకం సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
శివుడు అభిషేకప్రియుడు. అందుకే శివరాత్రి నాడు చాలామంది లింగాభిషేకం చేస్తుంటారు. కొంతమంది నేరుగా పాల ప్యాకెట్లతోనే శివలింగాన్ని అభిషేకిస్తుంటారు. కానీ అలా చేయవద్దని పండితులు చెబుతున్నారు. అలాగే రాగి కలశాన్ని కూడా ఉపయోగించకూడదు. స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రలలో పాలను తీసుకుని అభిషేకం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని అంటారు. అలాగే పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత నీళ్లతో అభిషేకం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. అయితే అభిషేకాలకు శంఖాన్ని మాత్రం వినియోగించకూడదు.
Also Read : శివరాత్రి జాగారం, ఉపవాసం ఎందుకు చేస్తారో తెలుసా
తులసీ దళాలు, కుంకుమ వాడొద్దు..
మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడిని బిల్వపత్రాలతో పూజించాలి. తులసీదళాలతో అస్సలు పూజించకూడదు. బిల్వ పత్రాలు, శమీ పత్రాలను ఉపయోగించవచ్చు. అయితే ఆ ఆకుల తొడిమె మొదటి భాగాన్ని తీసేసి శివలింగానికి సమర్పించాలి. గోగుపూలతో సేవ చేయడం కూడా శుభప్రదం. అభిషేకం తర్వాత పరమేశ్వరుడికి విభూది సమర్పించాలి. శివరాత్రి రోజే కాదు ఏ రోజైనా సరే శివునికి కుంకుమ సమర్పించడం నిషిద్ధం.
ప్రదక్షిణలు పూర్తిగా చేయవద్దు..
ఏ నైవేద్యం చేసినా మహదేవుడికి సమర్పించిన తర్వాత అందరికీ పంచాలి. అయితే పరమేశ్వరుడికి పాలను మాత్రం నైవేద్యంగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. లింగం చుట్టూ ప్రదక్షిణలు కూడా పూర్తిగా తిరగకూడదు. దీనివల్ల పూజా ఫలితం కూడా దక్కదని అంటున్నారు.
Also Read : అయోధ్య రామయ్య మందిరానికి బాహుబలి గంట..
ఉపవాసంలో ఈ జాగ్రత్తలు అవసరం..
శివరాత్రి రోజు ఉపవాసం ఉండే భక్తులు చాలా నిష్టతో ఉండాలి. రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే ఉపవాసం వదలాలి. ఉపవాసం అంటే పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉండాలనే నియమమేమీ లేదు. ఉపవాసం మధ్యలో పాలు, పండ్లు తీసుకొనవచ్చు. ఉపవాసం విడిచిన తర్వాత కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. మాంసం, మద్యం జోలికి పోకూడదు. ఉపవాసం సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. వాదనలు పెట్టుకోవద్దు. దుర్భాషలాడకూడదు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. దానధర్మాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు దక్కుతాయి.