అర్ధరాత్రిఆందోళన విరమించిన విద్యార్థులు

అర్ధరాత్రిఆందోళన విరమించిన విద్యార్థులు

1
TMedia (Telugu News) :

అర్ధరాత్రిఆందోళన విరమించిన విద్యార్థులు

టి మీడియా,జూన్ 21,బాసర: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో తమ ఆందోళన విరమించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో మంగళవారం నుంచి తరగతులకు హాజరవుతామన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న విషయం విదితమే. చర్చల అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు విలేకరులతో మాట్లాడారు. ఒక్కొక్కటిగా తమ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో తాము ఆందోళనను విరమిస్తున్నామని తెలిపారు. వీసీ నియామకంతో సహా అన్ని సమస్యలను ప్రాధాన్య క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నట్లు విద్యార్థులు వివరించారు. తక్షణమే రూ.5.6 కోట్ల నిధులను విడుదల చేస్తామని నిర్మల్‌ కలెక్టర్‌ పేర్కొన్నారు.

 

Also Read : యోగా దినోత్సవంలో పాల్గొని ఆసనాలు వేసిన మోదీ

రాత్రి 9.30గంటలకు మంత్రి రాక

అంతకు ముందు సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విద్యాలయ ఉపకులపతి రాహుల్‌ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్మన్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌, విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాలయానికి వచ్చారు. తొలుత అధికారులతో చర్చించారు. అనంతరం 20 మంది ఎస్‌జీసీ (స్టూడెంట్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌) విద్యార్థులతో ఆడిటోరియంలో చర్చలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు చర్చలు సాగాయి. అంతకు ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థులు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. భోజన విరామం తరువాత జోరుగా వర్షం కురిసినప్పటికీ గొడుగులతో శాంతియుతంగా ఆందోళన కొనసాగించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube