వైద్యురాలినిఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేత అరెస్ట్‌

వైద్యురాలినిఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేత అరెస్ట్‌

2
TMedia (Telugu News) :

వైద్యురాలినిఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేత అరెస్ట్‌
టీ మీడియా,ఎప్రిల్ 01,జైపూర్‌: వైద్యురాలిని వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాకు చెందిన డాక్టర్‌ అర్చనా శర్మ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు చెందిన ప్రైవేట్‌ ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించిన మహిళ రక్తస్రావంతో చనిపోయింది. అయితే ఆమె మరణానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళన చేశారు. వైద్యురాలు అర్చనపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె‌పై హత్య కేసును పోలీసులు నమోదు చేశారు.ఈ ఘటనపై డాక్టర్‌ అర్చన మనస్థాపం చెందింది. తనపై హత్య కేసు నమోదు చేయడంపై కలత చెందింది. తనను వేధింపులకు గురి చేసినట్లు ఆరోపించిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. అమాయక వైద్యులను వేధించద్దంటూ సూసైడ్ ‌నోట్‌ రాసింది. తన చావుతోనైనా తన అమాయకత్వం తెలుస్తుందని పేర్కొంది. తన భర్త, పిల్లలను వేధించవద్దని అందులో కోరింది.తన భార్యపై హత్య కేసు నమోదు కావడంపై ఆమె భయాందోళన చెందిందని డాక్టర్‌ అర్చన భర్త తెలిపారు. దీని వెనుక బీజేపీ సీనియర్‌ నేతలు ఉన్నారని ఆయన ఆరోపించారు. రోగి కుటుంబ సభ్యుల నిరసనల్లో బీజేపీ నేత జితేంద్ర గోత్వాల్‌ పాల్గొన్నారని, తన భార్యను వేధింపులకు గురి చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆయన విమర్శించారు.

Also Read : చిరు వ్యాపారులుకు అండగా ఉంటాం

ఈ నేపథ్యంలో బీజేపీ నేత జితేంద్ర గోత్వాల్‌తో సహా ఇద్దరిని రాజస్థాన్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. వైద్యురాలు అర్చన ఆత్మహత్యకు పాల్పడేలా ఆమెను వేధింపులకు గురి చేసినట్లుగా కేసు నమోదు చేశారు. 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.అయితే తన అరెస్ట్‌ను బీజేపీ నేత జితేంద్ర గోత్వాల్‌ ఖండించారు. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రోద్బలంతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితిని చూసేందుకు ఇక్కడకు రావాలని కోరుతూ ప్రియాంక గాంధీకి ఇటీవల తాను రైలు టికెట్లు పంపినందుకే తనపై కక్షగట్టారంటూ ట్విట్టర్‌లో మండిపడ్డారు.మరోవైపు వైద్యురాలి ఆత్మహత్యపై వైద్య సంఘాలు నిరసనకు దిగాయి. దీంతో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు. వైద్యురాలిపై పోలీస్‌ కేసు నమోదు చేసిన పోలీస్‌ అధికారిని సస్పెండ్‌ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube