బ్రిటన్ డిప్యూటీ ప్రధాని రాజీనామా
టీ మీడియా, ఏప్రిల్ 21, న్యూఢిల్లీ: బ్రిటన్ డిప్యూటీ ప్రధాని, న్యాయశాఖ మంత్రి డామినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వాధికారులను బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వ్యక్తిగత విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో డామినిక్ రాబ్ తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో బ్రిటన్ ప్రధానిగా రుషి సునాక్ బాధ్యతలు చేపట్టిన తర్వాత .. రుషి టీమ్ నుంచి తప్పుకున్న మూడవ క్యాబినెట్ మంత్రిగా రాబ్ నిలిచారు.బెదిరింపుల ఆరోపణలపై తనను విచారణకు పిలిచారని, తాను బెదిరింపులకు పాల్పడినట్లు ఆధారాలు చూపిన నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు తన ట్విట్టర్ ద్వారా రాబ్ వెల్లడించారు. డామినిక్ రాబ్‌ను విచారించేందుకు సీనియర్ న్యాయవాది ఆడమ్ టాలీని ప్రధాని రుషి సునాక్ అపాయింట్ చేసిన విషయం తెలిసిందే. మినిస్టర్ రాబ్‌తో కలిసి పనిచేసిన అనేక మంది సివిల్ సర్వెంట్లు గతంలో ఆయనపై ఫిర్యాదులు చేశారు. డామినిక్ పై వచ్చిన ఆరోపణల గురించి టాలీ ఇటీవల రిపోర్టు తయారు చేశారు. ఆ రిపోర్టును ప్రధాని రుషి సునాక్‌కు అందజేశారు. ఒకవేళ డామినక్ రాబ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమైతే, అప్పుడు ఆయన్ను మంత్రివర్గం నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారులతో ప్రొఫెషనల్‌గా ప్రవర్తించినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డామినిక్ తెలిపారు. డామినిక్ రాబ్‌పై 8 ఫిర్యాదులు వచ్చాయి. 24 మంది అధికారులు ఆ ఫిర్యాదులు అందజేశారు. గతంలో మంత్రిగా చేసినప్పుడు రాబ్ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు చేశారు. బోరిస్ జాన్సన్ క్యాబినెట్‌లో న్యాయశాఖ , విదేశాంగశాఖ మంత్రి చేశారు. ఆ తర్వాత థెరిసా మే క్యాబినెట్‌లో బ్రెగ్జిట్ సెక్రటరీగా రాబ్ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ సిబ్బందితో దురుసుగా వ్యవహరించినట్లు రాబ్‌పై ఆరోపణలు ఉన్నాయి.