జగన్నాథుడి ఆలయంలో సెల్ఫోన్లపై పూర్తి నిషేధం
లహరి, డిసెంబర్ 16, ఒడిశా : దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోకి స్మార్ట్ఫోన్లు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు.
గతంలో ఈ నిబంధనలను భక్తులకు మాత్రమే అమలు చేసిన అధికారులు ఇప్పుడు పోలీసు సిబ్బందితోపాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందు సేవకులు కూడా తమ స్మార్ట్ఫోన్లను ఆలయం బయట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఆలయ అధికారులు, సేవకులు మాత్రం ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్లు లేని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకెళ్లొచ్చని శ్రీ జగన్నాథ ఆలయం చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వీర్ విక్రమ్ యాదవ్ తెలిపారు.