ధూమపానానికి నిలయంగా చాయ్ దుకాణాలు

- యువత విచ్చలవిడిగా ధూమపానం

0
TMedia (Telugu News) :

ధూమపానానికి నిలయంగా చాయ్ దుకాణాలు

– యువత విచ్చలవిడిగా ధూమపానం

టీ మీడియా, జనవరి 2, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని పలు టీ స్టాల్ దుకాణాలు ధూమపానానికి నిలయాలుగా మారాయి. ప్రతిరోజు యువత విచ్చలవిడిగా ధూమపానం చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడు . ఈ నగరానికి ఏమైంది.ఒకవైపు పొగ మరోవైపు ధూళి ఎవరూ నోరు మెదపరేం అంటూ అటు టీవీల్లో ఇటు సినిమా హాళ్లల్లోనూ ప్రకటనలు హోరెత్తుతున్నాయి. ప్రకటనల మాటేమో గానీ బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగరాదన్న చట్టం చేసి పదేళ్లైనా అమలుకు నోచుకోవడం లేదు. పొగ రాయుళ్లు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ చుట్టు పక్కల వారిని అనారోగ్యం బారిన పడేస్తున్నారు. ఈ విషయమై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008 అక్టోబర్‌ 2న సిగరెట్స్‌ అండ్‌ టుబాకో ప్రొడక్ట్స్‌ యాక్ట్‌ (సీఓటీపీఏ–2008)ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం బస్టాండ్, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం. దీనిని అతిక్రమిస్తే రూ.200 జరిమానాతో పాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతుంది.

Also Read : విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర..

పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి.పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కొందరు పోలీసులకు ఈ చట్టం ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. కొందరు పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధ లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఏరియాలు అయిన డిగ్రీ కాలేజ్, జమ్మి చెట్టు, గాంధీ చౌక్ , అంబేద్కర్ విగ్రహం, రాజీవ్ చౌక్, కొత్త బస్టాండ్, ఆర్డీవో కార్యాలయం, రామాలయం, శ్రీనివాసపురం, మర్రికుంట, పాత బస్టాండ్, రాజనగరం రోడ్డు, నాగవరం, ఆహా హోటల్ దగ్గర, పానగల్ రోడ్ వంటి ప్రధాన ప్రదేశంలో హోటల్ యజమానులు ధూమపానం చేయడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి యువతకు విచ్చలవిడిగా ధూమపానం అలవాటు చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ఒక సిగరెట్ తీసుకొని దాదాపు ముగ్గురు త్రాగుతున్నారు. జిల్లాలో బీడీ, సిగరెట్, చుట్ట విక్రయాలు తగ్గడం లేదు. ధర ఎంతైనా వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. టీ దుకాణాలకు పలువురు చిన్న తరహా డీలర్లు తీసుకెళ్లి అక్కడి రిటైల్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి వ్యాపారం జరుగుతుంది.
పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులైన బ్రాంకైటిస్, ఆయాసం, సీఓపీడీ, గుండెజబ్బులు, రక్తనాళాలు మూసుకుపోవడంతో పాటు నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, రక్త క్యాన్సర్‌ వంటివి వచ్చే అవకాశం ఉంది. బీడీ, సిగరెట్, చుట్టలను ప్రత్యక్షంగా తీసుకోకపోయినా వాటిని వాడిన వారు వదిలే పొగను పీల్చినా పైన చెప్పిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Also Read : మ‌ణిపూర్‌లో మిలిటెంట్ల దాడి..

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని చట్టం చెబుతున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. బస్టాండ్, టీ కొట్లు, రైల్వేస్టేషన్‌లు, రైళ్లు, బస్సులలో ధూమపానం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలురు సైతం ఈ దురలవాటుకు బానిసలు కావడం బాధాకరం. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ వీటిని విక్రయిస్తూ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
చట్టం ఏమి చెబుతుందంటే
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి
పాఠశాలలు, కళాశాలల వద్ద పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు
ధూమపానం అలవాటు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్మోకింగ్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి.
రైతులు, వ్యాపారులు, రెస్టారెంట్‌ యజమానులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
రెవెన్యూ, పోలీస్, వైద్యులు కలిసి అప్పుడప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో దాడులు నిర్వహించి పొగతాగే వారికి జరిమానాలు విధించాలి.

Also Read : ‘హిట్ అండ్ రన్’ చట్టంపై డ్రైవర్ల ఆందోళన..

పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం బీడీ, సిగరెట్, చుట్ట తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటి వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగడం వల్ల సీఓపీడీ(క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌), క్యాన్సర్‌ వస్తుంది. 84 శాతం పొగతాగేవారు సీఓపీడీ వల్ల, 83 శాతం క్యాన్సర్‌ భారిన పడుతున్నా రు.దీంతో పాటు హార్ట్‌ ఎటాక్, కడుపు, నోటి క్యాన్సర్‌ వస్తాయి. కావున జిల్లా అధికారులు తక్షణమే గుర్తించి టీ స్టాల్ దుకాణాలలో ఉండే పొగ త్రాగే గదులను తొలగించాలని యువత జీవితాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube