వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష..

వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష..

1
TMedia (Telugu News) :

వర్షాలపై సీఎం జగన్‌ సమీక్ష..

టి మీడియా,జూలై 13తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కురుస్తున్న వానలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష జరిపారు. రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో పలు జిల్లాల్లో వరదలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉద్ధృతి, వరద సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.జూలై నెలలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నదని సీఎం జగన్‌ చెప్పారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఆయనన్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి 16 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నందున.. తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద వచ్చే అవకాశం ఉన్నదని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జగన్ సూచించారు.

 

Also Read : కవరేజ్ కి వెళ్లి ఎన్ టివి రిపోర్టర్ గల్లంతు

మరోవైపు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా దవాఖానల్లో వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచి పారిశుధ్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం తక్షణమే రూ.2 కోట్ల నిధులు విడుదల చేస్తున్నదని, వరదల వల్ల జరిగిన నష్టాలపై వివరాలు సేకరించి నిత్యం నివేదికల రూపంలో అందజేయాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలని, చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాని చెప్పారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో హోంమంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube