రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన సీఎం కెసిఆర్ ప్రజా సంపదను కొల్లగొడుతున్న పాలకులు

0
TMedia (Telugu News) :

వైన్స్ దుకాణాలను పెంచడమే తెలంగాణ అభివృద్ధా?
మధిర కాంగ్రెస్ ప్లీనరీ లో భట్టి విక్రమార్క ఫైర్

టీ మీడియా, డిసెంబర్27, మధిర:

మధిర మండల కేంద్రంలోని రెడ్డి గార్డెన్స్ సర్దార్ జమలాపురం కేశవరావు సభాప్రాంగణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ…అనేక త్యాగాలతో కాంగ్రెస్ సృష్టించిన దేశ సంపదను కొల్లగొట్టడం లో ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ లు పోటీ పడుతున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ తెచ్చుకుంది అప్పులు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వచ్చే రెండేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం మరో లక్ష కోట్లు అప్పు చేసి తెలంగాణ ప్రజలపై ఐదు లక్షల కోట్ల భారాన్ని మోపుతోందని వివరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ బడ్జెట్ ను దివాళ తీయించిన కేసీఆర్ ప్రజలపై పన్నుల భారం మోపడం కోసం విద్యుత్ చార్జీలు పెంచుతున్నాడని ధ్వజ మెత్తారు.

కరెంటు చార్జీలు పెంచిన నాటి చంద్రబాబు కు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు పడుతుందని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా ఆందోళనలు నిర్మించడానికి వచ్చే నెల 9 నుంచి మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ఎడవల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యకుండా నిరుద్యోగులను మోసం చేసి, రుణమాఫీ అమలు చేయకుండా రైతులను మోసం చేసి, పావలా వడ్డీ ఇవ్వకుండా మహిళలను మోసం చేసి తెలంగాణ అభివృద్ధి చేశారని టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు గా ఉందన్నారు. ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైన్స్ దుకాణాలను పెంచి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఊరి, ఊరికి బెల్టు దుకాణాలు విస్తరించడమే తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు చేసే పనులకు మంత్రులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాల పేరిట కొబ్బరికాయలు కొట్టడాన్ని అభివృద్ధి అంటారా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో 35 సంవత్సరాలు దాటిన నిరుద్యోగ యువత 100 రోజుల ఉపాధి పనులకు వెళ్లాల్సిన దుస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని ధ్వజమెత్తారు. పెను సవాలుగా మారిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో భట్టి విక్రమార్క కు ఆత్కూర్ క్రాస్ రోడ్ వద్ద నుంచి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వేమి రెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు రమణ గుప్తా, పార్టీ అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు దారా బాలరాజు, లాలయ్య, భూక్య బాలునాయక్, చిలువేరు బుచ్చి రామయ్య , ఉండయ్య, ఫయాజ్ , దుంప వెంకటేశ్వర్రెడ్డి, అద్దంకి రవి, తుమ్మేటి నవీన్ రెడ్డి, షైక్ జహంగీర్, బోడేపూడి గోపి, ఏదూరి శ్రీను, చావా వేణు, షేక్ బాజీ, అంకంరావు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Bhatti Vikramatra fires in Madhira Congress party.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube