గుజరాత్‌కు తరలిపోయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరి

రిమోట్‌తో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

1
TMedia (Telugu News) :

గుజరాత్‌కు తరలిపోయిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరి
-దాహోద్‌లో రూ.21,969 కోట్లతో ఏర్పాటు

రిమోట్‌తో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
టి మీడియా, ఎప్రిల్ 22,హైదరాబాద్:
1980లో ఇందిరాగాంధీ ఇచ్చిన హామీ అది
నేటికీ నెరవేర్చని జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ
బుట్టదాఖలైన తెలంగాణ సర్కారు ప్రతిపాదనలు
ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు ఆపసోపాలు
తెలంగాణ సొంతంగా ఎదుగుతుంటే కేంద్ర సర్కారు ఓర్వట్లే. ఏటా కేంద్రానికి తెలంగాణ లక్షల కోట్లు పన్నులు చెల్లిస్తున్నది. ఈ నిధులను మోదీ గుజరాత్‌కు మళ్లిస్తున్నారు. తెలంగాణకు హామీ ఇచ్చిన ప్రాజెక్టులను అటకెక్కిస్తున్నారు. ఇవన్నీ తెలిసీ రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసల్లా కొనసాగుతున్నారు.

Also Read : 100 కేజీల గంజాయి దహనం

టీ మీడియా, ఏప్రిల్‌ 22, హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి : సమాఖ్య స్ఫూర్తికి పదేపదే తూట్లు పొడుస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలించుకుపోతున్నారు. నిన్న ఆయుష్‌ విషయంలో, నేడు రైల్వే లోకోమోటివ్‌ యూనిట్‌ విషయంలో ఇదే జరిగింది. హైదరాబాద్‌లో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ (డబ్ల్యూహెచ్‌వోజీసీటీఎం) ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో ఊదరగొట్టి రోజులైనా తిరక్కుండానే ఆ కేంద్రాన్ని రాత్రికి రాత్రే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించుకుపోయిన మోదీ.. తాజాగా ఎన్నో ఏండ్ల నుంచి కాజీపేటను ఊరిస్తున్న లోకోమోటివ్‌ యూనిట్‌ (కోచ్‌ ఫ్యాక్టరీ)ని కూడా తన్నుకుపోయారు.

గుజరాత్‌లోని దాహోద్‌లో ఏకంగా రూ.21,969 కోట్లతో బుధవారం ఈ యూనిట్‌కు రిమోట్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని 1980లోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ వాగ్దానం చేసినా.. 2014 ఏపీ పునర్‌ విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచినా ఇప్పటికీ అతీగతీ లేదు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేవలం 6 నెలల్లోనే అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైపెచ్చు పూటకో మాటతో కేంద్ర మంత్రులు తెలంగాణను అపహాస్యం చేస్తున్నారు. ‘ఇప్పుడున్న కోచ్‌ ఫ్యాక్టరీలతోనే దేశ అవసరాలు తీరుతాయి’ అని ఓ కేంద్ర మంత్రి పార్లమెంటు వేదికగా ప్రకటించిన కొన్నాళ్లకే మోదీ సర్కారు మహారాష్ట్రలోని లాతూర్‌లో రూ.625 కోట్లతో మరాఠ్వాడా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది.

 

Also Read : విద్యార్థికి ఆర్థిక సాయం

తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సుమారు 1,484 కిలోమీటర్ల రైల్వే లైన్ల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. హైదరాబాద్‌ మెట్రో రైలుకు హక్కుభుక్తంగా రావాల్సిన రూ.254 కోట్ల వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌)ను ఇచ్చేందుకు కూడా మోదీ సర్కారుకు చేతులు రావడం లేదు. 2020లో రూ.1.10 లక్షల కోట్లతో శంకుస్థాపన చేసిన ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు 2023లో పట్టాలెక్కేందుకు పరుగులు తీస్తుంటే.. హైదరాబాద్‌-ముంబై బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఏండ్లకు ఏండ్లుగా సర్వేలతోనే ఆపసోపాలు పడుతున్నది.

ఎవరి సొమ్ము.. ఎవరి సోకు?
పసికందు లాంటి తెలంగాణ సొంతంగా ఎదుగుతుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఓర్వలేక గొంతులో వడ్ల గింజ వేసి చంపేందుకు కుట్ర పన్నుతున్నది. అన్నం పెట్టే తెలంగాణకు సున్నం పెట్టే దుస్సాహసానికి ఒడిగడుతున్నది. దేశాన్ని సాకుతున్న నాలుగు ప్రధాన రాష్ర్టాల్లో ఒకటైన తెలంగాణ.. ఏటా పన్నుల రూపంలో కేంద్రానికి లక్షల కోట్లు చెల్లిస్తున్నది. ఈ నిధులను మోదీ గుజరాత్‌కు మళ్లిస్తున్నారు.

Also Read : గుండెపోటు తో కుప్ప‌కూలిన గ‌వ‌ర్న‌ర్ అటెండ‌ర్

గత ఏడాది జూలైలో ఒకేరోజు రూ.71 కోట్లతో గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు, రూ.293 కోట్లతో మహాసేన-వరేతన వరకు 55 కి.మీ. గేజ్‌ మార్పిడి పనులకు, రూ.74 కోట్లతో సురేందర్‌నగర్‌-పిపావవ్‌ సెక్షన్‌ విద్యుద్దీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ, తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ రూట్లలో ఇండ్రస్టియల్‌ కారిడార్‌, ఢిఫెన్స్‌ కారిడార్‌ లైన్లను మెరుగుపరిచే ప్రతిపాదనలను మాత్రం అటకెక్కించారు. ఇవన్నీ తెలిసినా తెలంగాణ బీజేపీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తుండటం, కనీస సోయి లేకుండా ఢిల్లీకి బానిసల్లా కొనసాగుతుండటం తెలంగాణ దౌర్భాగ్యం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube