శివరాజ్ చౌహాన్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ షురూ
-మాజీ సీఎం కమల్ నాధ్
టీ మీడియా, అక్టోబర్ 10, భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్ నాధ్ తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. గత 18 ఏండ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేసిన చౌహాన్‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చౌహాన్ నేతృత్వంలోని కాషాయ పార్టీ పాలనలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం శివరాజ్ చౌహాన్ ఇంటికే పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులకు నాలుగో జాబితాలో చోటు కల్పించారని, అయితే ఈ మంత్రులు వారి నియోజకవర్గాలకు చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. మంత్రులకు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటు తప్పదని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కాషాయ పాలనకు ప్రజలు తెరదించుతారని కమల్ నాధ్ పేర్కొన్నారు.
Also Read : సేవ్ ఏపీ అంటూ రాష్ట్రపతికి లక్ష పోస్ట్ కార్డులు
కాగా, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు.ఇక నవంబర్ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube