అణ్వాయుధ క్రూయిజ్ మిస్సైల్‌ను ప‌రీక్షించాం

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్

0
TMedia (Telugu News) :

అణ్వాయుధ క్రూయిజ్ మిస్సైల్‌ను ప‌రీక్షించాం

– ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్

టీ మీడియా, అక్టోబర్ 6, సోచి: అణ్వాయుధాలు మోసుకెళ్లే క్రూయిజ్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. సోచి న‌గ‌రంలోని వాల్దాయి ఫోర‌మ్‌లో మాట్లాడుతూ.. ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. బురెవెస్నిక్ అణు క్షిప‌ణిని ర‌ష్యా ప‌రీక్షించిన‌ట్లు ఇటీవ‌ల అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొన్న‌ది. అయితే ఆ క‌థ‌నాన్ని ర‌ష్యా అధ్య‌క్ష కార్యాల‌యం ఖండించినా.. అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం శుక్రవారం ఆ విష‌యాన్ని అంగీక‌రించారు. ప్ర‌పంచ దేశాలను చుట్టేసే ఆ అణ్వాయుధ క్షిప‌ణిని ర‌ష్యా తొలిసారి 2018లో ప‌రీక్షించింది. ఆ శ‌క్తివంత‌మైన మిస్సైల్ రేంజ్ అప‌రిమిత‌మైంది. కానీ ఆ క్షిప‌ణి సామ‌ర్థ్యం గురించి ఇప్ప‌టి వ‌ర‌కు కొంతే తెలిసింది. గ‌తంలో నిర్వ‌హించిన బురెవెస్నిక్ మిస్సైల్ ప‌రీక్షలు విఫ‌లమైయ్యాయి. ఆర్కిటిక్ దీవుల్లో ర‌ష్యా న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఇటీవ‌ల కొన్ని శాటిలైట్ ఇమేజ్‌లు రిలీజ్ అయ్యాయి. వాటి ఆధారంగా ఆ క్షిప‌ణి ప‌రీక్ష జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. బురెవెస్నిక్ మిస్సైల్‌కు చెందిన చిట్ట‌చివ‌రి ప‌రీక్ష‌గా స‌క్సెస్ అయిన‌ట్లు పుతిన్ త‌న ప్ర‌సంగంలో తెలిపారు. ఇది చాలా వ్యూహాత్మ‌క‌మైన, అత్యాధునిక ఆయుధ‌మ‌న్నారు.

Also Read : కానిస్టేబుల్ కుటుంబం మృతి ఘటనలో సంచలన విషయాలు.

ఆ క్షిప‌ణిని స్కైఫాల్ అని నాటో పేర్కొంటోంది. న్యూక్లియ‌ర్ రియాక్ట‌ర్ శ‌క్తితో ఆ మిస్సైల్ ప‌నిచేయ‌నున్న‌ది. మిస్సైల్‌ను గాలిలోకి ప‌రీక్షించిన త‌ర్వాత రాకెట్‌లోని సాలిడ్ ఫుయ‌ల్ బూస్ట‌ర్లు యాక్టివేట్ అవుతాయి. అయితే బురెవెస్నిక్ ను గ‌తంలో 13 సార్లు ప‌రీక్షించార‌ని, కానీ ఆ ప‌రీక్ష‌ల్లో విఫ‌ల‌మైన‌ట్లు అమెరికా పేర్కొన్న‌ది. ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణి స‌ర్మ‌ట్ ప‌రీక్ష‌లు కూడా పూర్తి అయిన‌ట్లు పుతిన్ వెల్ల‌డించారు. అయితే త‌మ అణ్వాయుధ విధానంలో ఎటువంటి మార్పు లేద‌ని, ఒక‌వేళ ఎవ‌రైనా అణ్వాయుధ దాడికి ఉసిగొల్పితే, వారిపై అణు దాడి చేస్తామ‌ని మ‌రోసారి పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube