బతుకమ్మ పేర్చడం బౌద్దులు నేర్పించారా.?
లహరి, అక్టోబర్ 14, కల్చరల్ : బతుకమ్మను అందరూ ఒకేలా పేరుస్తారు కానీ చిన్న వ్యత్యాసం ఉంటుంది. కొందరు శివలింగంలా పేరిస్తే..మరికొందరు బౌద్ద స్తూపాకారంలో పేరుస్తారు. అసలు బతుకమ్మ పేర్చడం బౌద్దుల నుంచే నేర్చుకున్నారని కూడా అంటారు. దానికి సంబంధించి వివరణ కూడా ఇస్తారు.
బౌద్దులు నేర్పిన బతుకమ్మ :
పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారు చేసుకునేవారు. ఎందుకంటే బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల సమయానుకూలంగా స్తూపారాధనకు తమకు దొరికిన వస్తువులతో స్తూపాలను తయారు చేసుకుని బుద్దునికి ప్రతీకగా నమస్కరించేవారు. ఆరాధన అనంతరం స్తూపంలా పేర్చిన పూలు, ఇసుక, మట్టి, పేడను అలాగే నీటిలో కలిపేసేవారు. అయితే వాళ్లు తిరుగాడిన ప్రదేశాల్లో ఎక్కువ ప్రవాహాలు, వాగాలు తెలంగాణలోనే ఉన్నాయట. ఆ సమయంలో బౌద్దు భిక్షులు ఆచరించిన ఈ పద్ధతిని చూసి గిరిజనులు, వనాల్లో నివసించేవారు ఈ ఆచారాన్ని కొనసాగించారని చెబుతారు. వనదేవతలని అలా పూజించడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు పొందారని అంటారు. ఆ తర్వాత వచ్చిన మతపరిణామాల వల్ల వనదేవతలను బతుకమ్మగా చేసుకుని పూజించడం ప్రారంభించారట. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజిస్తున్నారు.
Also Read : నిత్యం నెగిటివ్ ఆలోచనలు వేధిస్తున్నాయా
దసరాకే బతుకమ్మ ఎందుకు.?
దసరా అంటే శక్తిని ఆరాధించే పండుగ. అయితే శక్తి పూజకు ఒకరోజు ముందుగానే బతుకమ్మ ప్రారంభమవుతుంది. పితృఅమావాస్య రోజు బతుకమ్మ ప్రారంభం. పితృ అమావాస్యతో ఈ పండుగను కలపడం అంటే శక్తితో పాటూ పితృదేవతలను కూడా పూజించడమే ఈ పండుగలో పరమార్థం.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక :
తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారెందరో. వారందరినీ తలుచుకుని ప్రతీకగా పూలు పేర్చి..బతుకమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారట. అందుకు అమ్మవారి అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో మధ్యలో గౌరమ్మను పెట్టి పూజిస్తారు..
Also Read : స్మార్ట్ కిడ్జ్ లో హోరెత్తిన బతుకమ్మ సంబురం.
అమ్మతనానికి నిదర్శనం :
వరుసలు వరుసలుగా పూలను పేరుస్తూ, వలయాకారపు మేరువులా తీరుస్తూ, ఆ పైన పసుపు గౌరమ్మను ఉంచడమే బతుకమ్మ. తెలంగాణ సంప్రదాయంలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని రెండు బతుకమ్మలను పేరుస్తారు. స్త్రీలోని మాతృత్వ కోణం ఇందులో పుష్కలంగా కనిపిస్తుంది. అంతకు మించి ఆడబిడ్డలకు పుట్టింటి బంధం, మగపిల్లలకు తోబుట్టువు అనుబంధం గొప్పతనాన్ని చాటిచెప్పే పండుగ బతుకమ్మ. అందాల బతుకమ్మ బతుకునిచ్చే అమ్మగా కనిపిస్తుంది. ప్రకృతే పరమాత్మ అని తలుస్తూ తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా నిలిచే ఈ పండుగ రూపురేఖలు మారిపోకుండా తర్వాత తరాలు కొనసాగించాలన్నదే పెద్దల ఆకాంక్ష.