దాశరథి కవితలు ఉద్యమ చైతన్య దీపికలు

దాశరథి కవితలు ఉద్యమ చైతన్య దీపికలు

1
TMedia (Telugu News) :

దాశరథి కవితలు ఉద్యమ చైతన్య దీపికలు
టి మీడియా,జూలై23, భద్రాద్రి కొత్తగూడెం:
దాశరథి కృష్ణమాచార్య కవితలు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ చైతన్య దీపికలు అని తెలంగాణ మలిదశ ఉద్యమ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ అన్నారు. జిల్లా గ్రంథాలయం ఆవరణలో శుక్రవారం దాశరథి 98వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దిండిగాల మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలకు చలించి పోయిన ఆయన నిజాం ప్రభువును ఎదిరిస్తూ తెలంగాణ విముక్తి కోసం పాటుపడ్డారని చెప్పారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ గర్వంగా ప్రకటించి ఉద్యమానికి ప్రేరణను అందించారని, చిన్నతనం నుండే చదువుల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న దాశరథి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో చక్కటి ప్రావీణ్యాన్ని సంపాదించారని చెప్పారు. రచనల పట్ల మక్కువ పెంచుకున్న ఆయన అతి సులువుగా అల్లిక కవితలు రాస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారని, ఆయన పలు సినీ గేయాలు కూడా రాశారని అన్నారు.

 

Also Read : బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

 

ఆంధ్ర మహాసభ లో చైతన్యవంతమైన పాత్రను నిర్వహించి నిజాం ప్రభువు ఆగ్రహానికి గురై జైలు జీవితాన్ని కూడా గడిపారని, పళ్ళు తోముకునే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి శిక్ష అనుభవించారని అన్నారు. మీర్జా గాలిబ్ ఉర్దూ గజల్లను తెలుగులోనికి గాలిబ్ గీతాల పేరిట అనువదించారని, తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రాసిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తాయని చెప్పారు. ఇంతటి మహా మేధావి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య రంగంలో కృషి చేసిన వారికి దాశరధి సాహిత్య పురస్కారాన్ని అందిస్తుందని చెప్పారు. అలాంటి వ్యక్తిని మనందరం స్మరించుకోవటం అదృష్టమని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి కరుణ కుమారి, ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్, గ్రంథ పాలకురాళ్లు డి.వరలక్ష్మి, జి.మణి మృధుల, సిబ్బంది, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube