దట్టంగా కమ్మేసిన మంచు
టీ మీడియా, జనవరి 11, హైదరాబాద్ : రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు చలిని తట్టుకోవడానికి మంటలు కాచుకున్నారు. రాష్ట్రంలో అతితక్కువగా రంగారెడ్డి జిల్లాలోని మంగల్‌పల్లిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 7.6, లింగాపూర్‌లో 7.7, రంగారెడ్డి జిల్లాలోని చుక్కాపూర్లో 7.7, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 7.8, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 7.9, రంగారెడ్డి జిల్లా తల్లపల్లిలో 8.1, వికారాబాద్ జిల్లా మన్నెగూడలో 8.2, ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 8.5, కుమ్రంభీ జిల్లా తిర్యానిలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మాల్చెల్మాలో 9.5 డిగ్రీలు, గౌరారంలో 10.4 డిగ్రీలు, ధర్మారంలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.