హైదరాబాద్ ను తలదన్నేలా మహబూబ్ నగర్ అభివృద్ధి
– హోంమంత్రి మహమూద్ అలీ
టీ మీడియా, అక్టోబర్ 9, మహబూబ్ నగర్ : హైదరాబాదును తలదన్నెలా మహబూబ్ నగర్ పట్టణం తయారైందని రాష్ట్ర హోంశాఖ మహమ్మద్ అలీ అన్నారు. సోమవారం అయన మహబూబ్ నగర్ సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలో నాడు-నేడు మహబూబ్ నగర్ ముఖచిత్రం పై రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ… గడచిన 9సంవత్సరాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టే విధంగా పుస్తక రూపంలో రూపొందించి ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఒక మంచి పుస్తకాన్ని విడుదల చేసిన అనుభూతి తనకు మిగిలిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఏ పథకం వచ్చినా మహబూబ్ నగర్ ను ఉదాహరణగా చెబుతారని, గతంలో మహబూబ్ నగర్ నుండి ప్రజలు బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి జీవించేవారని, అలాంటిది ఇప్పుడు మహబూబ్ నగర్ కు తిరిగి వస్తున్నారని, ఎన్నోసార్లు ముఖ్యమంత్రి సైతం మహబూబ్ నగర్ అభివృద్ధిని అభినందించారని తెలిపారు. మహబూబ్ నగర్ లో అభివృద్ధితో పాటు, పచ్చదనం పెరిగిందని, రోడ్డు కనెక్టివిటీ పెరిగిందని, హైదరాబాద్ ను తలదన్నే విధంగా శిల్పారామం, మినీ ట్యాంక్ బండ్, రోడ్లు, జంక్షన్లు అభివృద్ధి అయ్యాయని తెలిపారు.
Also Read : తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్..
మహబూబ్ నగర్ అభివృద్ధిని చూసి చాలామంది మహబూబ్ నగర్ కు వస్తున్నారన్నారు. గతంలో మహబూబ్ నగర్ లో తాగడానికి మంచి నీళ్లు ఉండేవి కాదని, అలాగే ఎలాంటి అభివృద్ధి లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసిన ఘనత శ్రీనివాస్ గౌడ్ కు దక్కుతుందని, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులని, నిరంతరం అభివృద్ధికై పనిచేసే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉండటం సంతోషమన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు బాగున్నాయని, జిల్లా కలెక్టర్, ఎస్పీలు బాగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత అధికారులు, ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నందునే ఇంత పురోగతి సాధ్యమైందని ఆయన కితాబిచ్చారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… గత 10 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మహబూబ్ నగర్ ను సమస్యల నుండి బయటకు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఇప్పుడు మహబూబ్ నగర్ రూపురేఖలు మారిపోయాయన్నారు. మహబూబ్ నగర్ ముఖచిత్రాన్ని పుస్తక రూపంలో నాడు- నేడు- భవిష్యత్తు కళ్ళకు కట్టే విధంగా పుస్తకాన్ని రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read : నవంబర్ 1 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ ప్రోగ్రాం
జిల్లా యంత్రాంగం రేయింబవళ్ళు కష్టపడి పనిచేసినందునే ఇది సాధ్యమైందని తెలిపారు. ప్రతి ఒక్కరు నా తెలంగాణ అన్న భావనతో పనిచేసి చూపించారని, దీనివల్ల ఎంతో వేగంగా అభివృద్ధి సాధ్యమైందన్నారు. నాడు 14రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని, ఏది కావాలన్నా హైదరాబాద్ కు వెళ్లే పరిస్థితి ఉండేదని, గత పాలకులు మహబూబ్ నగర్ ను ఎడారిగా మార్చారని, అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, కేటీఆర్ సహకారంతో ఎంతో అభివృద్ధిని సాధించడం జరిగిందని తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… మహబూబ్ నగర్ గతంలో ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో పుస్తక రూపంలో చూపించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రవినాయక్, జిల్లా ఎస్పీ కే.నరసింహ, మూఢ చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గొర్రె కాపరుల సంఘం అధ్యక్షులు శాంతన్న యాదవ్, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube