ప్రగతిపథంలో తెలంగాణ

టీ మీడియా,మార్చి8,

0
TMedia (Telugu News) :

ప్రగతిపథంలో తెలంగాణ
-బహిరంగ సభలో కేసీఆర్

టీ మీడియా,మార్చి8,వనపర్తి: వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ‘ఎక్కడ స్త్రీలు పూజించబడతారో.. గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు’.. అంటూ సీఎం ప్రసంగం ప్రారంభించారు. వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ వూహించలేదు. మహబూబ్‌నగర్‌లో ఎక్కడ చూసినా కరువు, బీడు భూములు కనిపించేవి. ఉద్యమ సమయంలో జిల్లాను చూస్తే కళ్లల్లో నీరు తిరిగేది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమ జెండా పరిపాలనలో ఉంటేనే న్యాయం జరుగుతుందని రెండు సార్లు అధికారం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇవాళ 5 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్‌నగర్‌ జిల్లా వజ్రపు తునకగా మారుతుంది. ధాన్యపు రాశులతో ఇప్పటికే పాలమూరు జిల్లా పాలు కారుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌ నుంచి గద్వాల వరకు పచ్చదనం కనిపిస్తోంది. గతంలో పాలమూరు జిల్లా నుంచి లక్షల మంది వలస పోయేవారు. ఇప్పుడు కర్నూలు, కర్ణాటక వాసులు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వలస వస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మన ప్రజాప్రతినిధుల అసమర్థత వల్ల వెనుకబడిపోయాం. వనపర్తిలో ఎకరం భూమి రూ.3 లక్షలు ఉండేది.. ఇవాళ రూ.3 కోట్ల ధర పలుకుతోంది. ఒక్క మెడికల్‌ కాలేజీ లేని పాలమూరులో 5 మెడికల్‌ కాలేజీలు ఎలా సాధ్యమయ్యాయి.

 Also Read : ఇబ్బంది పెట్టె వారిపై పరమైన చర్యలు: సీఐ

 

 Also Read : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తెలంగాణ వలే దేశం పరిస్థితి మారాలి..

తెలంగాణలో ఇవాళ ఆత్మహత్యలు.. ఆకలి చావులు లేవు. తెలంగాణలో విద్యుత్‌ కోతలు లేవు.. వలసలు లేవు. సొంత రాష్ట్రం వస్తే ఇలా బతుకుతాం అని చెప్పాం.. చేసి చూపించాం. తెలంగాణ వలే దేశం పరిస్థితి కూడా మారాలి. ప్రజల దీవెన ఉంటే మరింత పురోగమిస్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రస్తుతం దేశంలో గోల్‌మాల్‌ పరిస్థితులు నెలకొన్నాయి. దేశాన్ని ఆగం పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలకు మతపిచ్చి, కుల పిచ్చి లేపి రాజకీయాలు మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా.. రాజకీయ చైతన్యం ఉన్న తెలంగాణలో అలాంటి పరిస్థితి రానివ్వను. దేశం కోసం పోరాటానికి మేం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం ఎలా కొట్లాడామో.. ఈ దేశంలో శాంతి, సామరస్యాన్ని, మంచిని కాపాడేందుకు అవసరమైతే నా ప్రాణం కూడా ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నా.

నిరుద్యోగుల కోసం రేపు కీలక ప్రకటన

నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో రేపు కీలక ప్రకటన చేయబోతున్నా. రేపు ఉదయం 10గంటలకు అందరూ గమనించాలి. గిరిజనుల రిజర్వేషన్‌ పెంపు ప్రతిపాదనను కేంద్రానికి పంపితే మోదీ ఆమోదించలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాను.. భాజపాను బంగాళాఖాతంలో కలపాలి. ప్రజలకు మతపిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసే వారికి బుద్ధి చెప్పాలి’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube