హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించండి
– రాజ్యసభ, లోక్‌సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
టీ మీడియా, ఫిబ్రవరి 2, న్యూఢిల్లీ : అదానీ గ్రూపు సంస్థలపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన నివేదికపై తక్షణమే చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు గురువారం రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. దేశ ప్రజలు, దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే రీతిలో ఆ నివేదిక ఉన్నట్లు ఎంపీ కేశవరావు తన వాయిదా తీర్మానం లేఖలో పేర్కొన్నారు. రూల్ 267 కింద చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ నేత కోరారు. ఇక లోక్‌సభలోనూ ఇదే అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. లోక్‌సభలో కూడా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అదానీ గ్రూపు పాల్పడిన ఆర్ధిక అవకతవకలపై చర్చించాలని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాయి. 267 కింద ఈ అంశాన్ని చర్చించాలని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఓ లేఖలో కోరారు. అదానీ గ్రూపు ఫ్రాడ్‌కు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. అదానీ గ్రూప్ స్టాక్స్ ట్రేడింగ్‌లో మోసాలు, అవకతవకలకు పాల్పడుతున్నదని న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న షార్ట్ షెల్లింగ్ సంస్థ.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ 32 వేల పదాలతో గతవారం నివేదిక రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు
దీంతో స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరిగిన ప్రతి రోజూ అదానీ గ్రూప్ సంస్థలు బిలియన్ల డాలర్ల సంపద కోల్పోతున్నది. గతేడాది పోర్టుల నుంచి ఎఫ్ఎంసీజీ, మైనింగ్, ఇంధనం తదితర రంగాల్లో దూసుకెళ్లడంతో ఆయన గ్రూప్ సంస్థల స్టాక్స్ ధరల్లో ర్యాలీ నమోదైంది. ఫలితంగా గతేడాది కొద్దికాలం పాటు ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానాన్ని ఆక్రమించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube