పెరుగు తింటే జలుబు చేస్తుందా..?
లహరి, డిసెంబర్19, ప్రతినిధి : హైదరాబాద్: ఈ రోజుల్లో మనిషి ఆహారపు అలవాట్లలో పెరుగు ముఖ్య భాగంగా మారిపోయింది. పెరుగును ఇష్టపడని వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలామందికి ఆహారం చివరలో కొంతైనా పెరుగన్నం లేకపోతే భోజనం చేసినట్టే ఉండదు. ఇక కమ్మటి గడ్డ పెరుగేసుకుని తింటే ఆ మజానే వేరు. పెరుగుతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. మరి ఇంతటి ప్రాముఖ్యమున్న పెరుగును చలికాలంలో చాలామంది దూరం పెడుతారు. జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయపడుతారు. ఆరోగ్య నిపుణులు మాత్రం అది ఒట్టి అపోహేనని కొట్టి పారేస్తున్నారు. చలికాలంలో పెరుగు తిన్నా నష్టం లేదని చెబుతున్నారు.
పెరుగు తినడంవల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగుతుంది. దాంతో మన శరీరం అనారోగ్య సమస్యలను చురుగ్గా ఎదుర్కోగలుగుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు పెరుగుతాయని చాలామంది పెరుగు తినడం మానేస్తారు. కానీ, అలాంటి సమస్యలు తగ్గడానికి పెరుగే సరైన ఔషధమని నిపుణులు చెబుతున్నారు.. చలికాలంలో కొంతమందిని మలబద్దకం సమస్య వేధిస్తుంటుంది. పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి చలికాలంలో సైతం పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా లాభమే తప్ప నష్టం ఉండదు.పెరుగులో కాల్షియం ఉంటుంది. దీనివల్ల శరీరంలోని కండరాలకు బలం చేకూరుతుంది. అంతేగాక ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా తయారవుతాయి. దంత సమస్యలు కూడా దూరమవుతాయి.పెరుగును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడంవల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.
Also Read : గోదాదేవి ‘పాశురాలు చైతన్యదీపా లు
దీనివల్ల హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు (బీపీ)ని సైతం పెరుగు కంట్రోల్ చేస్తుంది. అయితే పెరుగును సాధ్యమైనంత వరకు పగటిపూట మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు పెరుగు తింటే మ్యూకస్ పేరుకునే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు మాత్రం రాత్రిళ్లు పెరుగును అసలే ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా రోగులు రాత్రిళ్లు పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుందంటున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube