లాభాల దిశగా రైతులు ముందడుగు వేయాలి
బృహత్ పల్లె ప్రకృతి వనం సందర్శించిన కలెక్టర్ అనుదీప్
టీ మీడీయా,డిసెంబర్ 7, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ మంగళవారం పినపాక మండలంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు.
మొదటిగా పినపాక మండలంలోని పోట్లపల్లి గ్రామంలో రైతులకు యాసంగి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోట్లపల్లి సర్పంచ్ తోలెం కళ్యాణి ఆధ్వర్యంలో జరగగా, వ్యవసాయ శాఖకు సంబంధించిన జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు,మణుగూరు వ్యవసాయ సహ సంచాలకులు తాతారావు మొదలగువారు రైతులకు ఉపయోగపడే విధంగా ఉండే వాణిజ్య పంటల గురించి వివరించడం జరిగింది. యాసంగిలో వరి పంటను వేయడం మానుకోవాలని, రాగులు, సజ్జలు, మినుములు, కూరగాయలు వంటి పంటలు వేసుకొని అధిక లాభాలు గడించాలని తెలియజేశారు.
అనంతరం సర్పంచ్ తోలెం కళ్యాణి మాట్లాడుతూ… కలెక్టర్ తమ గ్రామానికి మూడు సార్లు రావడం జరిగిందని,ఆయన సలహాలు సూచనలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తున్నానని, కలెక్టర్ కు తన కృతజ్ఞతలు తెలియజేశారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ….రైతులు లాభాలు వచ్చే పంటలను వేసుకోవాలని, పినపాక వ్యవసాయంలో ముందంజలో ఉందని, ఇప్పటికే చాలా మంది రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరిస్తున్నారు అని తెలియజేశారు.
జానంపేట గ్రామానికి చెందిన ఎల్లంకి నరసింహారావు, ఆధునిక ధోరణిలో వ్యవసాయం చేస్తూ పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నారు. భారత ఆహార సంస్థ ఇకపై వరి పంట కొనుగోలు ను వేసవికాలంలో నిలిపి వేస్తుందని,ప్రతి ఒక్కరు ప్రత్యామ్నాయ పంటల దిశగా ఆలోచనావిధానం సాగించాలని తెలియజేశారు.
అనంతరం ఏడూళ్ల బయ్యారం గ్రామంలో రేషన్ దుకాణం వద్ద వ్యాక్సిన్ వేస్తున్న ఆశా కార్యకర్తలను,ఏఎన్ఎం లను కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అదే ప్రదేశంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు శివకుమార్, పినపాక మండల తహసీల్దార్ విక్రమ్ కుమార్ లను కోవిడ్ వ్యాక్సినేషన్ సంపూర్ణంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని అన్నారు.
పినపాక మండలంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరుస్తూ, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు ను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సర్పంచులు, ఉప సర్పంచులు పాల్గొనడం జరిగింది.