గొంతెండాల్సిందేనా?
టీ మీడియా, ఫిబ్రవరి 13, గుంటూరు ప్రతినిధి : చలి తీవ్రత తగ్గి వేసవి సీజన్ ప్రారంభమైంది. పలు గ్రామాల్లో తాగునీటి సమస్య పొంచి ఉంది. పెండింగ్‌లో ఉన్న పథకాలను పూర్తి చేసేందుకు నిధుల సమస్య వెంటాడుతోంది. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షను ఇవ్వాలనే లక్ష్యంగా చేపట్టిన జలజీవన్‌మిషన్ కార్యక్రమం మందగమనంగా సాగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.433 కోట్లతో 1580 గ్రామాల్లో 5,79,156 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో చేపట్టిన ఈ పథకం ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. లక్ష్యం సాధనకు 2024 వరకు అవకాశం ఉన్నా ఇప్పటి వరకు 70 శాతం గ్రామాలు కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో తక్షణం చేపట్టాల్సిన పనులింకా కొలిక్కి రాలేదు. పల్నాడు ప్రాంతంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గుంటూరు, పల్నాడు జిల్లాలోని 9 నియోజకవర్గాల పరిధిలో 450 గ్రామాలకు రక్షిత తాగునీటి వసతి కల్పించేందుకు రూ.2665 కోట్ల అంచనాలతో పరిపాలన ఆమోదంతో ఉత్తర్వులు ఇచ్చినా ఒక్క నియోజకవర్గంలో కూడా పనులు ప్రారంభం కాలేదు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అమలులో భాగంగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు, గుంటూరు పార్లమెంటు పరిధిలో తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు కలిపి ఈ పనులను చేపట్టాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్ నుంచి బుగ్గవాగు ద్వారా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు తాగునీటిని అందజేసేలా డిపిఆర్ తయారు చేశారు. ఈ ఉత్తర్వులు కాగితాలకే పరిమితమయ్యాయి.ప్రతి మనిషికి గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో రోజుకి 135 లీటర్లు సరఫరా చేసేలా మార్గదర్శకాలు రూపొందించారు. వినుకొండ నియోజకవర్గం పరిధిలో పలు గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. రక్షితనీటి పథకాలు నిర్వహణలో గ్రామపంచాయతీల అలసత్వం వల్ల తరచూ మరమ్మతులకు గురై సకాలంలో తాగునీరు లభించడం లేదు.
Also Read : తెనాలి మున్సిపల్ ఉద్యోగుల నిరసన
కృష్ణానదికి సమీపంలో ఉన్న గ్రామాల్లోనూ నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రాజధాని గ్రామాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో నీటి సరఫరా లేదు. చాలా గ్రామాలకు నిత్యం తాగునీరు సరఫరా కావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి, కొన్ని గ్రామాలకు అయితే వారానికి ఒక సారినీటి సరఫరా చేస్తున్నారు. ఎక్కువ మంది తాగునీటిని కొనుగోలు చేసి తాగడానికి అలవాటు పడటం వల్ల అధికారులపై వత్తిడి తగ్గిందనే వాదనలు విన్పిస్తున్నాయి. తాగునీటి ఎద్దడిపై చర్చించాలని ఈనెల 4వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టినా సభ్యులకు సూచించారు. అయితే ఎక్కువ మంది స్పందించలేదు. పల్నాడు ప్రాంతానికి చెందిన జెడ్‌పిటిసిలు మాత్రం బోర్లు వేయడానికి అనుమతివ్వాలని కోరగా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అంగీకరించారు. ప్రతిఏటా ఏప్రిల్‌లో ప్రణాళికలు రూపొందించడం, ప్రభుత్వం నిధుల మంజూరులో జాప్యం చేయడం, తీరా కొన్ని గ్రామాలకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేయడం పరిపాటైంది. దీంతో నిధులు వచ్చే సరికి మళ్లీ వర్షాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube