మాదకద్రవ్యాలను నిరోధించడమే లక్ష్యం :ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
టీ మీడియా, ఏప్రిల్ 9,హైదరాబాద్: తెలంగాణలో గంజాయి, మాదకద్రవ్యాలను నిరోధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సమాజంలో ఎప్పటినుంచో ఉన్న వీటిని క్రమంగా కూకటివేళ్లతో పెకిలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు నగరంలోని పబ్ యజమానులతో శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. అబ్కారీ శాఖ సంచాలకులు సర్ఫరాజ్, అదనపు కమిషనర్ అజయ్ రావు సమీక్షలో పాల్గొన్నారు. పబ్‌ల నిర్వహణ విషయంలో పాటించాల్సిన నియమ నిబంధనలపై యజమానులతో మంత్రి చర్చించారు. ఇటీవల ఫుడింగ్ పబ్‌లో కొకైన్ పట్టుబడిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ మొదటి దశలో పేకాట క్లబ్‌లను మూసి వేయించారు. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
Also Read : చిన్న ఆలోచన పెద్ద మనసు
పోలీసులను సమన్వయం చేసుకుంటూ అబ్కారీ శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే అవసరమైతే పీడీ చట్టం ప్రయోగిస్తాం. మాదక ద్రవ్యాలు విక్రయించే వాళ్లకు రాష్ట్రంలో చోటు లేదు. ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణకు చెడ్డ పేరు తెస్తే ఊరుకునేది లేదు. నిజాయతీగా వ్యవహరిస్తేనే పబ్‌లకు అనుమతిస్తాం.. లేకపోతే సీజ్ చేస్తాం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహానగరాల్లో పబ్‌ల సంస్కృతి ఉంది. రాష్ట్రానికి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో పబ్‌లకు అనుమతి ఇచ్చాం. మాదక ద్రవ్యాలు విక్రయిస్తే మాత్రం సహించేది లేదు. రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుందంటే పబ్‌లను మూసేయడానికి కూడా వెనుకాడేది లేదు. మాదక ద్రవ్యాల వెనక ఎంతటి వాళ్లు ఉన్నా వదలకూడదని సీఎం స్పష్టంగా చెప్పారు. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube