తేజస్వియాదవ్ నివాసంలో ఈడి సోదాలు
టీ మీడియా,మార్చి 10,న్యూఢిల్లీ : ఆర్‌జెడి నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌కి చెందిన ఢిల్లీ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. మనీలాండరింగ్ ఆరోపణలపై లాలూ, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన 15కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. ఉద్యోగం కోసం భూమి కేసులో తేజస్వి తల్లిదండ్రులు లాలూ యాదవ్, రబ్రీదేవీలను విచారించిన సంగతి తెలిసిందే. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన కుమార్తె మిసా భారతి నివాసంలో ఉంటున్న కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ యాదవ్‌ను ఈ నెల 7న సిబిఐ విచారించింది. ఆ ముందు రోజు అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధమైన రబ్రీదేవిని పాట్నానివాసంలోవిచారించింది. రాజకీయ కక్షల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ తేజస్వీయాదవ్ సహా ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాసిన అనంతరం ఈ దాడులు జరగడం గమనార్హం.