ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్న నడ్డా

1
TMedia (Telugu News) :

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

-ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామన్న నడ్డా

టి మీడియా, నవంబరు6,న్యూఢిల్లీ  :  హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ సీఎం జైరామ్ ఠాకూర్, రాష్ట్ర పార్టీ చీఫ్ సురేశ్ కశ్యప్, తదితరులతో కలిసి మీడియా సమావేశంలో జేపీ నడ్డా మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను తెలిపారు. 11 ప్రాధాన్య అంశాలతో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప్ పత్ర’ను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి, రైతుల సంక్షేమం, పర్యాటకాన్ని బలోపేతం చేసేలా ఈ మేనిఫెస్టోను రూపొందించినట్లు జేపీ నడ్డా తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)ని తీసుకు వస్తుందని చెప్పారు. దీని కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, వారి నివేదిక ఆధారంగా రాష్ట్రంలోయూసీసీని అమలు చేస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దశలవారీగా 8 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.

Also Read : వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు.

ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలు, ఎకనామిక్ జోన్‌లో జరుగుతున్న పనులకి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయని జేపీ నడ్డా అన్నారు. బీజేపీ ప్రభుత్వం ‘శక్తి’ కార్యక్రమాన్ని ప్రారంభించనుందని చెప్పారు. దీని కింద మతపరమైన ప్రదేశాలు, దేవాలయాల చుట్టూ మౌలిక సదుపాయాలు, రవాణాను అభివృద్ధి చేయడానికి 10 సంవత్సరాల వ్యవధిలో రూ.12,000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. హిమాచల్ లో 5 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తామని చెప్పారు.ఆరోగ్య మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని, ప్రాథమిక ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొబైల్ క్లినిక్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని జేపీ నడ్డా వివరించారు. తద్వారా దూర ప్రాంతాల ప్రజలు మెరుగైన వైద్య సదుపాయాలు పొందవచ్చని అన్నారు. వక్ఫ్ ఆస్తులపై సర్వే నిర్వహించి చట్ట ప్రకారం విచారణ జరిపి, వాటి అక్రమ వినియోగాలను అరికడతామని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube