బాధ్యతల బరువు అందరూ మోయాలి

మగువా లోకానికి తెలుసా నీ విలువా

0
TMedia (Telugu News) :

బాధ్యతల బరువు అందరూ మోయాలి !

– మగువా లోకానికి తెలుసా నీ విలువా..

-నీ సహనానికి సరిహద్దులు కలవా..

-అటు ఇటు అన్నింటా, నువ్వే జగమంతా

లహరి, మార్చి 7, కల్చరల్ : అలుపని రవ్వంత అననే అనవంట… వెలుగులు పూస్తావు వెళ్లే దారంత… అనే పాటలో స్త్రీ ఔన్నత్యం, త్యాగం, కష్టం, శ్రమ అంతా కనిపిస్తుంది.ఇటువంటి పాటలు అందరి హృదయాలనూ కదిలిస్తాయి. ఆలోచింపజేస్తాయి. మొదటి నుంచి సమాజంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. యాభై ఏళ్ల క్రితం అమ్మమ్మలు, నానమ్మలు ఇళ్లకే పరిమితి అయ్యారు. ఇంటిని చక్కబెడుతూనే పిల్లల్ని, భర్తని, పెద్దల్ని , బంధువులను చూసుకుంటూ ఉండేవారు. జనరేషన్‌ మారుతున్న కొద్దీ అమ్మాయిలను చదివించారు. ఉద్యోగాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు వ్యక్తిగతంగా అభివృద్ధి అవుతున్నా… కుటుంబ బాధ్యతలు మాత్రం తగ్గలేదు. దాంతో వారిపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. కుటుంబంలో, సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు కుటుంబసభ్యులు, సమాజం, ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అందరి కోసం నిత్యం ఆలోచించే, శ్రమించే మహిళలకు ‘మేమున్నాం’ అంటూ భోరసా ఇవ్వాలి. అప్పుడే మహిళా దినోత్సవ సంబరాలకు అర్థం ఉంటుంది. ఆధునిక కాలంలో కుటుంబ అవసరాల రీత్యా ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. విద్య, రాజకీయాల్లో, క్రీడలు, విజ్ఞానం, కళలు, సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నారు. రకరకాల నైపుణాల్లో ముందున్నా సమాజంలో వారిపై ఉన్న చూపు పోలేదు. ‘ఇంటి పని భార్య/ కోడలు/ అమ్మే చేయాలి’ అన్న ఆలోచన మాత్రం మారలేదు. పిల్లల్ని కనడం దగ్గర నుంచి స్కూలుకు వెళ్లే వరకూ ఆ బిడ్డకు సపర్యలు చేస్తూనే ఉంటుంది.

Also Read : సెబీ ఏం చేస్తోంది ?

ఏదైనా ఒంట్లో బాగోకపోతే ఆ బిడ్డను తీసుకు ఆసుపత్రికి తీసుకెళ్లె బాధ్యత కూడా తనే చేస్తుంది. పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లి, తీసుకురావడం కోసమే ఎక్కువ మంది తల్లులు తమ కెరీర్‌ మీద దృష్టి పెట్టడం లేదని సర్వేలు వెల్లడించాయి. ఈ క్రమంలో వారు ఏ ఇతర ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా కుటుంబ ఆర్థిక, ఆనారోగ్య సమస్యలు మొత్తం తనపై పడుతున్నాయి. దాంతో మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. రుతుక్రమం మీద ప్రభావం చూపుతున్నాయి. హార్మోన్ల విడుదల్లో లోపం ఏర్పడి చికాకులు, కోపం తరచూ వస్తుంటాయి. వీటన్నిటిని తట్టుకుంటూ, సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఇళ్లకు బంధువులు వచ్చినప్పుడు ముందు ఆమె సెలవు పెట్టాలి. ఇంట్లో అత్త, మామ, భర్త అనారోగ్యానికి గురైనప్పుడు దగ్గరుండి మర్యాదలు చేయాలి. అందుకే అత్తింటి, పుట్టింటి వారి ఆలోచన ధోరణుల్లోనూ మార్పు రావాలి. పండగలు, శుభాకార్యాలకు వెళ్లినప్పుడు పని మొత్తం ఆ ఇంటి కోడలు/ కూతురు మీదకువదిలేయకుండా వంట పనిలో సహాయం చేయాలి. ఆమెతో ఉండి ఇంటి పనిలో భాగం అవ్వాలి. అప్పుడే తోటి ఆడవారి పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుంది.ముందు జీవిత భాగస్వామి ఆమెకు తోడుగా నిలబడాలి. నిత్యం ఆమెను అర్థం చేసుకుని ‘నేనున్నాను’ అనే ధైర్యం ఇవ్వాలి. నీవు తక్కువ అనే ఆత్మన్యూనత భావం కలగకుండా ఇద్దరమూ సమానమే అనే నమ్మకాన్ని కలిగించాలి. ఆమె ఆరోగ్యం పట్లా శ్రద్ధ కనబరచాలి. ఇంటి బాధ్యతలను పంచుకోవాలి. పిల్లలు, బంధువుల ముందు ఆమె అభిప్రాయాలకు, అనుభూతలకు గౌరవం ఇవ్వాలి. అప్పుడే సమాజంలోనూ మార్పు వస్తుంది.

Also Read : ముంతాజ్‌ కు యోగ చార్య అవార్డ్‌ ప్రదానం

ఉద్యోగం చేసే చోటా …
ఓ వైపు ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్నా కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. పై అధికారుల ఒత్తిళ్లు, తోటి ఉద్యోగులతో పనవ్యవహారంలో తేడాలు ఉంటూనే ఉంటాయి. వీటన్నిటిని దాటుకుంటూ ఆమె ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. అటు పై అధికారుల అసహనం, ఇంట్లో పనిఒత్తిళ్ల మధ్య సరిగ్గా తినకా ఉరుకులు పరుగులతో ఆఫీసులకు చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వారిలో ఆత్మవిశ్వాసం పెంచేలా, పోషకాహారం అందించేలా సంస్థలు బాధ్యత తీసుకోవాలి. వారి భద్రత విషయంలో ఉన్నత అధికారుల ప్రత్యేక చొరవ చూపాలి. ‘మహిళలు ఆర్థికంగా, స్వశక్తితో ఎదగాలి’ అనే సూక్తులు వల్లించకుండా వారికి పనిలో ఆ ప్రోత్సాహం ఇవ్వాలి. ఎటువంటి బాధలో ఉన్నారో గ్రహించి సెలవుల విషయంలో వెసులబాటు ఉండాలి. మహిళ భద్రత కోసం చట్టాలు ఉన్నట్లే ఉద్యోగం చేస్తున్న మహిళలకు ప్రత్యేక చట్టాలు, భరోసా కల్పించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube