హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జీ బాదుడు నుంచి ఊరట

హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జీ బాదుడు నుంచి ఊరట

1
TMedia (Telugu News) :

హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జీ బాదుడు నుంచి ఊరట
టి మీడియా,జులై6,న్యూఢిల్లీ, జూలై 4: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జీ బాదుడు నుంచి వినియోగదారులకు ఊరట లభించనుంది. దీనికి సంబంధించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) రంగంలోకి దిగింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులో ఆటోమెటిగ్గా లేదా డీఫాల్ట్‌గా సర్వీస్‌ చార్జీని విధించకుండా నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కస్టమర్లు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. ఈమేరకు సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటి ప్రకారం.. హోటళ్లు లేదా రెస్టారెంట్లు సర్వీస్‌ చార్జీని చేర్చరాదు. మరే ఇతర పేరుతోనూ సేవా చార్జీని వసూలు చేయకూడదు. సర్వీస్‌ చార్జీని చెల్లించాలని వినియోగదారున్ని బలవంతం చేయరాదు. సర్వీస్‌ చార్జీ అనేది స్వచ్ఛందం, ఐచ్ఛికం, వినియోగదారు ఇష్టమని వినియోగదారుకు స్పష్టంగా తెలియజేయాలి. సర్వీస్‌ చార్జీ చెల్లింపు ఆధారంగా వినియోగదారులను హోటల్‌ లేదా రెస్టారెంట్‌ లోకి అనుమతించడం, వారికి అందించే సేవలపై ఆంక్షలు విధించవద్దు. హోటళ్లు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్టు వినియోగదారులు గుర్తిస్తే దాన్ని తొలగించమని కోరవచ్చు. వినియోగదారుడు 1915కి ఫోన్‌ చేసి లేదా నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌ లైన్‌ (ఎన్‌సీహెచ్‌) మొబైల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా వినియోగదారు కమిషన్‌లో ఫిర్యాదులు చేయవచ్చు. ఈ-దాఖిల్‌ పోర్టల్‌ ద్వారా ఎలక్ర్టానిక్‌ రూపంలో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.

Also Read : అనంత విష్ణుదేవ ప్రభు లీలలపై పోలీసుల దృష్టి

సీసీపీఏ ద్వారా విచారణ, తదుపరి చర్యల కోసం వినియోగదారుడు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సమర్పించవచ్చు. ఈ-మెయిల్‌ ద్వారా సీసీపీఏకు ఫిర్యాదును పంపించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులకు తెలియజేయకుండా సర్వీస్‌ చార్జీని బిల్లులో డీఫాల్ట్‌గా విధిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గుర్తించినట్టు సీసీపీఏ పేర్కొంది. మెనూలో పేర్కొన్న ఆహార పదార్థాల మొత్తం ధర, వర్తించే పన్నులకు అదనంగా ఇతర రుసుము లేదా చార్జీ పేరిట సర్వీస్‌ చార్జీని వసూలు చేస్తున్నట్టు తెలిపింది. హోటల్‌ లేదా రెస్టారెంట్‌ అందించే ఆహారం, బేవరేజెస్‌ ధరలో సర్వీసు అంతర్లీనంగా ఉంటుందని మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఇక హోటళ్లు లేదా రెస్టారెంట్లు వినియోగదారులకు అందించాలనుకునే ఆహారం లేదా పానీయాల ధరలను నిర్ణయించే విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపాయి. ఆర్డరు ఇవ్వడమంటే మెనూలో ఉన్న ఆహార పదార్థాల ధరలను పన్నులతో కలిపి చెల్లించడానికి సమ్మతించినట్టు అవుతుందని పేర్కొన్నాయి. మెనూలో పేర్కొన్న మొత్తంకన్నా ఎక్కువ వసూలు చేస్తే అది అనైతిక వ్యాపార విధానం కిందకు వస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తాను పొందిన సేవలకు టిప్‌ ఇవ్వాలనుకుంటే అది వినియోగదారు ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube