ధాన్యం కొనుగోలు దోపిడీ

- కేంద్రాల్లో రూ.10 కేజీల అదనం

0
TMedia (Telugu News) :

ధాన్యం కొనుగోలు దోపిడీ
– కేంద్రాల్లో రూ.10 కేజీల అదనం
-ప్రయివేటుగా విక్రయిస్తే రూ.200 నష్టం

టి మీడియా, జనవరి 5,విజయనగరం: జిల్లా గుర్ల మండలం పెదనాగళ్ల వలసకు చెందిన పిసిని సత్యం ఒకటిన్నర ఎకరాల్లో వరి సాగు చేశారు. తిండికి ఉంచుకోగా మిగిలిన ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధపడగా స్థానిక కొనుగోలు కేంద్రం నుంచి గోనె సంచులు ఇవ్వలేదు. సొంత సంచులు, వాహనంతో సమీపంలోని ఓ మిల్లుకు తీసుకెళ్లాలని కొనుగోలు కేంద్రంలోని సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారు. దీంతో, ఆయన అనివార్యంగా స్థానిక దళారులకు క్వింటాలు రూ.1900 చొప్పున 20 క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు. ప్రభుత్వం తీరు వల్ల దళారులు తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ ‘ప్రజాశక్తి’ ఎదుట సత్యం వాపోయారు.

Also Read : అంగన్‌వాడీల నిరాహార దీక్షలు ప్రారంభం

పంతులుగారి పేరున ఉన్న భూములు వివాదంలో ఉండడంతో తమ ఊరిలో ఉన్న చాలా భూములు రికార్డుల్లోకి ఎక్కలేదని, దీంతో, ప్రభుత్వానికి విక్రయించుకునే అవకాశం లేక వ్యాపారులకే ఎంతోకొంతకు అమ్ముకోవాల్సి వస్తోందని అదే గ్రామానికి చెందిన బెవర రాంబాబు, సెట్టి సత్యం అనే రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రం సిబ్బంది సూచన మేరకు ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళే,్త అక్కడ క్వింటాలుకు ఆరు కేజీల చొప్పున అదనంగా తీసుకున్నారని పాలవలసకు చెందిన బూడి రామునాయుడు చెప్పాడు. తూకంలో మోసాన్ని భరించలేక పాలవలస పంచాయతీ నక్కపేటకు చెందిన ముద్దాడ పండోడు… పెనుమజ్జిపేట వ్యాపారికి క్వింటాలు రూ.1900 చొప్పున 50 క్వింటాళ్ల ధాన్యం తెగనమ్ముకున్నారు.విజయనగరం జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ‘ఎ’ గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ.2203, సాధారణ రకం రూ.2,183 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో 500 గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు, అక్కడ సిబ్బంది, తూకం, తేమ శాతం కొలిచే సాధనాలు, గోనె సంచులు, జిపిఎస్‌ సిస్టం కలిగిన వాహనాలను అందుబాటులో ఉంచినట్టు అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఆయా కేంద్రాల్లో సిబ్బంది తప్ప, సౌకర్యాలేవీ లేవు. అక్కడికి వెళ్లిన రైతులకు ఓ కాగితం ముక్క చేతిలోపెట్టి పలానా మిల్లుకు ధాన్యం తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

Also Read : 9న రాజ్యసభ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ

గోనె సంచులు, వాహన సదుపాయం అందుబాటులో లేక రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. గోనె సంచులు కొనుగోలు చేసి, అద్డె ట్రాక్టరు లేదా నాటుబళ్లపై సంబంధిత మిల్లులకు తీసుకెళ్తే, అక్కడ అదనంగా 6 కేజీల నుంచి 10 కేజీల వరకు గుంజుతున్నారు. ఈ లెక్కన కిలో రూ.22 చొప్పున ప్రతి క్వింటాలుకు రూ.132 నుంచి రూ.220 వరకు రైతు నష్టపోతున్నాడు. గోనె సంచులు తిరిగి ఇవ్వడం లేదు. ప్రయివేటు వ్యాపారులు గ్రామాల్లో రంగ ప్రవేశం చేసి క్వింటాలుకు రూ.1900 నుంచి రూ.1950 ధర ఇస్తున్నారు. దీంతో, క్వింటాలుకు రూ.200 వరకు రైతులు నష్టపోతున్నారు. జిల్లాలోని రైసు మిల్లులు ప్రజాప్రతినిధులవి, రాజకీయ నాయకులవి కావడం, వ్యాపారులు కూడా వారి అనుయాయులు కావడంతో వీరితో అధికారులు కుమ్మక్కవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube