నకిలీ బాబాలకు అడ్డా సంజయ్‌నగర్‌

జాతకం పేరుతో ఆకర్షణ.. పూజలంటూ లక్షల్లో మోసం

1
TMedia (Telugu News) :

నకిలీ బాబాలకు అడ్డా సంజయ్‌నగర్‌

జాతకం పేరుతో ఆకర్షణ.. పూజలంటూ లక్షల్లో మోసం

– దేశవ్యాప్తంగా బాధితులు

-టీవీల్లో ప్రకటనలు.. సోషల్‌ మీడియాలో ప్రచారం

టీ మీడియా, అక్టోబర్ 22,హైదరాబాద్‌ / హర్తలాల్‌ : ఆ పూజ చేస్తే బాగుంటుందేమో.. ఫలానా బాబాను నమ్మితే కలిసొస్తుందేమోననే అమాయకుల ఆలోచనలు మోసగాళ్లకు కాసులు కురిపిస్తున్నాయి. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ బాబాలు చెలరేగిపోతున్నారు. అయితే, బాబాల పేరుతో జనాన్ని నిలువునా ముంచుతున్న నకిలీ బాబాల కోసం ఒక ఊరే ఉన్నదన్న విషయం విస్మయం కల్గిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీ(ఎన్‌సీఆర్‌) పరిధిలోని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా హర్తలాల్‌ సంజయ్‌నగర్‌లో ఉన్నవారంతా నకిలీ బాబాలని పోలీసులు నిర్ధారించారు. ఇక్కడ ఇంటికో నకిలీ బాబా ఉన్నట్టు తెలుసుకొని నిర్ఘాంతపోయారు. ఏదైనా మోసం వెలుగు చూసినప్పుడు నిందితులను పట్టుకొనేందుకు అక్కడికి వెళ్తున్న పోలీసులకు వాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులు వచ్చారంటే చాలు సినీఫక్కీలో పరారవ్వడం, కుటుంబ సభ్యులతో తిరుగుబాటు చేయిస్తుండటం పోలీసులకు తలపోటుగా మారుతున్నది. ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్‌ యువతి నుంచి ఆన్‌లైన్‌లో పరిచయం అయిన ఓ నకిలీ బాబా రూ.47 లక్షలు కాజేసిన విషయం సంచలనం సృష్టించింది. ఇలాంటి మోసాలు చేసేదంతా ఒకే ముఠావారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

టీవీల్లో ప్రకటనలు.. సోషల్‌ మీడియాలో ప్రచారం…..
స్థానికంగా ఉండే కేబుల్‌ టీవీల్లో ఈ నకిలీ బాబాలు ప్రకటనలు ఇస్తుంటారు. అయితే, ప్రకటనలు ఇస్తున్నదెవరో కూడా తెలియకుండా జాగ్రత్తపడతారు. ఫోన్‌లోనే ప్రకటన బుక్‌ చేసి, ఆన్‌లైన్‌లో డబ్బు పంపిస్తుంటారు. జాతక దోషాలు తొలగిస్తామంటూ సోషల్‌ మీడియాలోనూ ప్రచారాలతో నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. వాళ్ల గురించి వాళ్లే కామెంట్లు రాసుకొంటూ, గ్రూపుల్లో చర్చించుకొంటూ ఇతరులను బుట్టలో పడేస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జరిగిన ఇదేతరహా చర్చ కారణంగా హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు తన కష్టార్జితాన్ని పోగొట్టుకున్నది. గతంలో ఢిల్లీ పరిసర ప్రాంతాలకే పరిమితమైన నకిలీ బాబాలు.. ఐదేండ్లుగా తమ మోసాలను దేశ వ్యాప్తం చేశారు. నిందితులు ఫోన్లలో మాట్లాడుతున్నప్పుడే బాధితుల మతం గురించి తెలుసుకొని పూజలు చేయడం గమనార్హం. హర్తలాల్‌లోని సంజయ్‌నగర్‌లో ఉన్న వాళ్లలో చాలావరకు ఒకే మతానికి చెందిన వారు బయట బాబాలుగా చలామణి అవుతున్నారు.

 

Also Read : చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించడం బాధాకరం

పట్టుకోవడం కష్టమే…
సైబర్‌ నేరాల్లో ఆరితేరిన భరత్‌పూర్‌, జామ్‌తారా గ్యాంగుల మాదిరిగానే ఇప్పుడు హర్తలాల్‌ నకిలీ బాబాల గ్యాంగ్‌ ఉన్నది. కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను గుర్తించి పట్టుకొనే ప్రయత్నం చేస్తే తిరగబడతారు. ఇతర రాష్ర్టాల పోలీసులు వాళ్లను పట్టుకొనేందుకు విఫలయత్నం చేస్తుంటారు. ధైర్యం చేసి పట్టుకొంటే మతకలహాలను సైతం సృష్టిస్తారు. శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతో కొన్నిసార్లు స్థానిక పోలీసులు కూడా సహకరించరు. ఇలాంటివన్ని ఈ నకిలీ బాబాలకు కలిసి వస్తున్నాయి. కాగా, ఆన్‌లైన్‌లో పరిచయాలు, ఆన్‌లైన్‌ పూజలు, ఆన్‌లైన్‌లో జోతిష్యాల వెనుక మోసం దాగి ఉండే అవకాశాలున్నాయి అనే విషయాన్ని గుర్తించాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఎక్కడో ఉండి పూజలు చేస్తామని.. అందుకోసం డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారంటే అనుమానించాలని సూచిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube