మరాఠా రిజర్వేషన్ కు అనుకూలమే
– మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే
టీ మీడియా, నవంబర్ 1, న్యూఢిల్లీ : మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. మరాఠా కోటాపై బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసన అనంతరం షిండే ఈ మేరకు ప్రకటించారు. సీఎం అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం మరాఠా కోటాకు డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను విరమించాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మరాఠాలకు రిజర్వేషన్లు వర్తింపచేసేందుకు ప్రభుత్వంతో సహకరించాలని జరాంగేకు అఖిలపక్షం విజ్ఞప్తి చేసిందని సీఎం షిండే తెలిపారు. రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన విధివిధానాలు ఖరారు చేసేందుకు ప్రభుత్వానికి సమయం అవసరమని, ఈ విషయంలో మరాఠాలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, అంతకుముందు ఈ అంశంపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని బీద్‌లో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనలను ఫడ్నవీస్ ఖండించారు.
Also Read : కేసీఆర్ పై పోటీ అంటే పోచమ్మ ముందు పొట్టేలును కట్టేసినట్టే
హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. మరాఠాలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని, ఈ దిశగా ఈరోజే కొన్ని నిర్ణయాలు వెలువడతాయని, కానీ కొందరు హింసను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి శక్తులను ఉపేక్షించేంది లేదని ఆయన పేర్కొన్నారు. బీద్ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube