తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..

తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..

2
TMedia (Telugu News) :

తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న విదేశీ భామలు..

 

టీ మీడియా, నవంబర్‌ 27 :

విదేశీ నటులను పరిచయం చేయడం తెలుగు సినిమాకు కొత్తేం కాదు! సిట్యుయేషన్‌ భారీగా డిమాండ్‌ చేస్తే గానీ విదేశీయులు తెరపై కనిపించేవారు కాదు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా రోజుల్లో ఒకట్రెండు స్పై మూవీల్లో పరదే ‘స్త్రీ’లను చూపించిన దాఖలాలు ఉన్నాయి. అయితే, పూర్తిస్థాయి పాత్రలు ఉండేవి కావు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘అమెరికా అమ్మాయి’లో ఫ్రెంచ్‌ నృత్యకారిణి అనిక్‌ చయ్‌మొటి ప్రధాన పాత్రలో కనిపించింది. నిజజీవితంలో ఆమె దేవయానిగా పేరు మార్చుకొని భరతనాట్యం నేర్చుకుంది. అంతేకాదు, దేశవిదేశాల్లో నాట్య ప్రదర్శనలిచ్చింది. ఇక దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పరదేశి’ సినిమాలో విదేశీ యువతి మొనెట్‌ క్విక్‌ నాయికగా కనువిందు చేసింది.కొన్నేండ్లుగా విదేశీ వనితలు భారతీయ సినిమాల్లో నటిస్తున్నారు. కత్రినా కైఫ్‌, సన్నిలియోన్‌, నర్గిస్‌ ఫక్రి విదేశీ మూలాలు ఉన్నవాళ్లే! ‘మల్లీశ్వరి’తో తెలుగువారికి సుపరిచితురాలైన కత్రినా విదేశీయురాలే. ‘ఎవడు’తో టాలీవుడ్‌కు పరిచయమైన అమీ జాక్సన్‌ బ్రిటిష్‌ నటి. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమాలో థాయ్‌ నటి సవికా చాయదేజ్‌ తళుక్కుమంది. ఆది హీరోగా నటించిన ‘గాలిపటం’ సినిమాలో ఆస్ట్రేలియా నటి క్రిస్టినా అఖీవా ఓ పాత్రలో మెరిసింది. తాజాగా ఈ లిస్ట్‌లో చాలామంది చేరుతున్నారు. ఒకటీ అరా సినిమాల్లో నటించి వెళ్తున్నవాళ్లు కొందరైతే.. భారతీయ సినిమాల్లో స్థిరపడాలని బలంగా భావిస్తున్న వాళ్లు మరికొందరు. ప్రయత్నాల దశలో ఉన్నవారు ఇంకొందరు.

ట్రిపుల్‌ ఆర్‌ భామ
రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో విదేశీ నటులు చాలామంది ఉన్నారు. బ్రిటిష్‌ పాలన నేపథ్యం కావడంతో దేశదేశాల నుంచి జూనియర్‌ ఆర్టిస్టులను సైతం రప్పించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటించిన ఒలీవియా మోరిస్‌ లండన్‌కు చెందిన నాటక కళాకారిణి. జెన్నిఫర్‌ పాత్రలో ఆమె నటనకు ఎందరో ఫిదా అయ్యారు. ట్రిపుల్‌ ఆర్‌కు సీక్వెల్‌ ఉంటుందని రాజమౌళి ప్రకటించడంతో అందులో జెన్నిఫర్‌ పాత్ర ఉంటుందా అన్న ఉత్సుకత మొదలైంది. ప్రస్తుతం హెచ్‌బీవో మ్యాక్స్‌ సిరీస్‌ ‘ద హెడ్‌’ సీజన్‌ 2లో నటిస్తున్నదామె.

ఉక్రెయిన్‌ మెరుపు
జాతిరత్నాలు ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రిన్స్‌’. శివకార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ తమిళ సినిమా ఇటీవలే తెలుగులోనూ విడుదలైంది. ఇందులో నాయికగా ఉక్రెయిన్‌ మెరుపు మరియా ర్యాబోషప్కా నటించింది. మాతృదేశంలో ఒకట్రెండు సినిమాల్లో నటించిన ఆమె.. ‘ప్రిన్స్‌’తో మొదటిసారి తెలుగువారిని పలకరించింది. చక్కటి అందం, అందుకు తగ్గ అభినయంతో అలరించింది. ‘అవకాశం వస్తే తరచూ తెలుగు సినిమాల్లో నటిస్తాను’ అని మరియా చెబుతున్నది. ఇప్పటికైతే మరే సినిమా అంగీకరించకపోయినా.. ఆమె ఆసక్తి గమనిస్తుంటే త్వరలోనే మరోసారి టాలీవుడ్‌ తెరపై ప్రత్యక్షం కావడం ఖాయంగా కనిపిస్తున్నది.

గ్రీకు సుందరి
తమిళ హీరో ధనుష్‌ హీరోగా వచ్చిన ‘నానే వరువెన్‌’లో నటించిన ఎలీ అవ్రామ్‌ స్వీడిష్‌-గ్రీక్‌ మూలాలున్న మంచి నటి. భారతీయ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2013 నుంచి బాలీవుడ్‌ సినిమాల్లో కనిపిస్తున్నది. తాజాగా ‘గుడ్‌ బై’లో అమితాబ్‌తో నటించింది. రెండో సినిమాతోనే దక్షిణాది వారికి చేరువైంది. అదే సినిమా ‘నేనే వస్తున్నా’ పేరుతో టాలీవుడ్‌లోనూ విడుదల కావడంతో తెలుగు వారికి దగ్గరైంది. ‘ఇండియాతో నాది జన్మజన్మల అనుబంధం’ అంటున్న ఎలీ మరిన్ని తెలుగు సినిమాల్లో
కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు.

వీరమల్లుతో నర్గిస్‌
అమెరికన్‌ భామ నర్గిస్‌ ఫక్రి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలంగాబాలీవుడ్‌లో హిట్‌ చిత్రాల్లో నటించింది. ‘రాక్‌స్టార్‌’, ‘మద్రాస్‌ కేఫ్‌’, ‘కిక్‌’ వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తున్నది నర్గిస్‌. క్రిష్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చారిత్రక చిత్రం ‘హరిహర వీరమల్లు’లో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో జట్టుకడుతున్నది. ఫక్రి టాలీవుడ్‌ జర్నీ ఈ చిత్రం విజయంపై ఆధారపడి ఉంది.

బ్రెజిల్‌ జిగేల్‌
మెగాస్టార్‌ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించిన సత్యదేవ్‌ కెరీర్‌ ఇప్పుడు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నది. ఆయన నటిస్తున్న చిత్రంలో విదేశీ భామ కథానాయికగా ఎంపికైంది. బ్రెజిల్‌కు చెందిన మోడల్‌ జెన్నిఫర్‌ పిచినెటో ఒక హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవల అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ‘రామ్‌సేతు’లో కీలక పాత్ర పోషించింది జెన్నిఫర్‌. ఆ సినిమాలో సత్యదేవ్‌ కూడా నటించడం విశేషం. ఈ ఇద్దరూ మరో సినిమాలో జట్టు కడుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube