ప్రజాస్వామ్యానికి పునాది ఓటు

ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

0
TMedia (Telugu News) :

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు

– ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

టీ మీడియా, అక్టోబర్ 31, ఖమ్మం బ్యూరో: ఓటు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు తప్పక వినియోగించుకొనేలా అవగాహనకు మంగళవారం నూతన కలెక్టరేట్ లో వినూత్నంగా ప్రభుత్వ సిబ్బందికి నవంబర్ 30న ఓటు వేయాలని ప్రత్యేకంగా రూపొందించిన బ్యాడ్జీలు, ప్రభుత్వ వాహనాలకు స్టిక్కర్లు కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే, పట్టణ ప్రాంతంలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందని, 70 శాతం పోలింగ్ పట్టణంలో జరిగిందని, పోలింగ్ శాతం పట్టణ ప్రాంతాల్లో పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వున్నారు కావున వారికి పోలింగ్ తేదీతో ఓటు వేయాలని స్పూర్తి కలిగేలా వుంటుందని, దానిని చూసి ప్రజాల్లోనూ చైతన్యం వస్తుందనే ఆలోచనతో బ్యాడ్జీలు, స్టిక్కర్లు తయారుచేయించి, ఉద్యోగులందరికి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు అందరూ పోలింగ్ తేదీ నవంబర్ 30 వరకు ఇట్టి బ్యాడ్జీలు ధరించాలని, తమ వాహనాలపై స్టిక్కర్లు ప్రదర్శించాలని అన్నారు. ద్విచక్రవాహనాలకు స్టిక్కర్లు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

Also Read ; సింగిరెడ్డి వాసంతి ఇంటింటి ప్రచారం

ఆర్టికల్ 326 ద్వారా కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే బేధం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికి ఓటు హక్కు కల్పించారన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటును ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య బలోపేతం ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా స్వీప్ నోడల్ అధికారి శ్రీరామ్, సిపిఓ ఏ. శ్రీనివాస్, జిల్లా కోశాధికారి వి. సత్యనారాయణ, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube