గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం
లహరి, నవంబరు 25, తిరుమల : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు గురువారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు రాత్రి పద్మావతి దేవి స్వర్ణ గజ వాహనంపై విహరిస్తారు.
Also Read : అటవీ అధికారులు, సిబ్బందికి భరోసా కల్పించండి
గజపటాన్ని ఆరోహణం చేయడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలమేలు మంగ వాహనసేవల్లో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసముద్రంలో ప్రభవించిన సిరులతల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు.